bro review
Home » BRO Movie Review | బ్రో మూవీ రివ్యూ

BRO Movie Review | బ్రో మూవీ రివ్యూ

by admin
0 comment

నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అలీ రెజా తదితరులు..
రచన, దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
నిడివి: 2 గంటల 15 నిమిషాలు
సెన్సార్: U
రేటింగ్: 2.75/5

పవన్ కల్యాణ్ నుంచి మరో సినిమా వచ్చింది. ఈసారి సాయిధరమ్ తేజ్ కూడా తోడయ్యాడు. అలా ఇద్దరు మెగా హీరోలు కలిసి ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇంతకీ బ్రో సినిమా ఎలా ఉంది? అంచనాలు అందుకుందా?

కథ
మార్క్ (సాయి ధరమ్ తేజ్) అతని తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో హైదరాబాద్ లో ఉంటాడు. అతడి తమ్ముడు యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. పెద్ద కొడుకైన మార్క్, తండ్రి చనిపోయిన తర్వాత, కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. అంతేకాకుండా.. కుటుంబానికి టైమ్ ఇవ్వకుండా, డబ్బు సంపాదనలో పడిపోతాడు. అడిగితే “టైం లేదు” అంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ రమ్య (కేతిక శర్మ) లిప్‌స్టిక్‌ను కూడా టేస్ట్ చేసే “సమయం” అతడికి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కారులో ఆమెను కలుస్తాడు.

వైజాగ్‌లో బిజినెస్ మీటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు మార్క్. తన పెళ్లికాని చెల్లెళ్లు, పార్కిన్సన్స్ తో బాధపడుతున్నతల్లి, తన మరణంతో కుంగిపోతారని భయపడి, మరోసారి జీవించడానికి టైటాన్ (పవన్ కల్యాణ్) ను మరో అవకాశం కోరుతాడు.

మార్క్, తన కుటుంబంతో పరిపూర్ణంగా జీవించడానికి, జీవితాన్ని సరిదిద్దుకోవడానికి 90 రోజులు టైమ్ ఇస్తాడు కాలదేవుడు టైటాన్. అలా తిరిగి భూమ్మీదకు వచ్చిన మార్క్, తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు.. జీవితానికి అర్థం ఎలా తెలుసుకున్నాడు.. అనేది ఈ సినిమా కథ.

నటీనటుల పనితీరు
ఇది సాయిధరమ్ తేజ్ సినిమా కాదు. పవన్ కల్యాణ్ సినిమా. ఇందులో హీరో పవన్ కల్యాణ్. సెకెండ్ హీరో సాయిధరమ్ తేజ్. వన్ లుక్స్, మేనరిజమ్స్ బాగున్నాయి. తన పాత సూపర్ హిట్ సినిమాల్ని గుర్తు చేస్తూ, పవన్ చేసిన యాక్టింగ్, చూపించిన మేనరిజమ్స్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తాయి. ఇక సాయితేజ్ తన పాత్రను బాగా పోషించాడు. రోహిణి, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్, రాజా, తణికెళ్ల భరణి, తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా బాగుంది. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ అదిరింది. ప్రతి ఫ్రేమ్ ను తీర్చిదిద్దాడు ఇతడు. ఇక తమన్ విషయానికొస్తే, పాటలతో నిరాశపరిచిన తమన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దుమ్ముదులిపాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఎడిటింగ్ పెర్ ఫెక్ట్ గా ఉంది. ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. పబ్ సెట్, ఇంటి సెట్ రిచ్ గా తీర్చిదిద్దాడు.

దర్శకుడు సముద్రఖని ఈ కథకు చాలా మార్పుచేర్పులు చేశాడు. ఫ్లాట్ గా ఉండే పాయింట్ ను పవన్ కోసం మార్చిన విధానం బాగుంది. త్రివిక్రమ్ తో కలిసి కూర్చొని చాలా సన్నివేశాలను రీ-రైట్ చేశాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఒరిజనల్ తో పోలిస్తే, సాయితేజ్ పాత్రను పూర్తిగా మార్చేసిన విధానం బాగుంది. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే, మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. అయితే మరీ గుర్తుపెట్టుకునేంత స్థాయిలో డైలాగ్స్ రాయలేకపోయాడు. ఇటు త్రివిక్రమ్, అటు సముద్రఖని కలిసి పవన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపించింది.

విశ్లేషణ
వినోదాయ శితం అనే సినిమాకు రీమేక్ గా వచ్చింది బ్రో సినిమా. రీమేక్ ప్రాజెక్టుల్ని నెటివిటీకి తగ్గట్టు, హీరో ఇమేజ్ కు తగ్గట్టు మార్చడంలో ఇప్పటికే డాక్టరేట్ అందుకున్నాడు త్రివిక్రమ్. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాల్ని అతడు ఎలా మార్చాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వినోదాయశితంను కూడా అదే విధంగా బ్రో గా మార్చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు అతడి స్క్రీన్ ప్లే, మాటలు ఓ ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాయి.

మార్క్ ను పరిచయం చేస్తూ మొదలౌతుంది బ్రో సినిమా. ఆ వెంటనే అతడి క్యారెక్టరైజేషన్ తో పాటు, ఇతర పాత్రల్ని కూడా చకచకా పరిచయం చేస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మార్క్ పాత్రను టైటాన్ తో కలుపుతారు. ఇక అక్కడ్నుంచి సినిమా కమర్షియల్ ఫార్మాట్ లోకి మారుతుంది. అడుగడుగునా పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, అతడి పాత పాటలు, పవన్ అల్లరి.. ఇలా సరదాగా ఫస్టాఫ్ మొత్తం సాగిపోతుంది.

ఓ మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్టాఫ్ ముగిస్తాడు దర్శకుడు. అయితే కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే చూపిస్తే ఎలా, కథను కూడా నడపాలి కదా. అందుకే సెకెండాఫ్ లో కథపై ఫోకస్ పెట్టాడు. దీంతో నెరేషన్ కాస్త డల్ అవుతోంది. కథ స్లోగా సాగుతుంది. అయినప్పటికీ అక్కడక్కడ పవన్ కల్యాణ్ మెరుస్తాడు. అంతేకాదు, ఒరిజినల్ తో పోలిస్తే, చేసిన మార్పులు సెకండాఫ్ లో కనిపిస్తాయి. ఇలా మిక్స్ డ్ ఫీలింగ్స్ తో సాగుతున్న సెకెండాఫ్, ప్రీ-క్లయిమాక్స్ కు వచ్చేసరికి పూర్తిగా సెంటిమెంట్ టర్న్ తీసుకుంటుంది. ఇక క్లయిమాక్స్ కు వచ్చేసరికి పాత్రలన్నింటికీ ఓ జస్టిఫికేషన్ ఇచ్చి ముగిస్తాడు దర్శకుడు.

రెగ్యులర్ తెలుగు సినిమా టైపులో బ్రో మూవీ క్లయిమాక్స్ లో భారీ ఫైట్లు కనిపించవు. ఎమోషనల్ డైలాగ్స్ వినిపించవు. కథ ప్రకారం శాడ్-ఎండింగ్ తోనే సినిమా ముగుస్తుంది. కాబట్టి థియేటర్ నుంచి ప్రేక్షకుడు జోష్ తో బయటకు రాలేడు. ఓ మంచి ఫీలింగ్ అయితే అందిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఒరిజినల్ చూసిన వాళ్లకు బ్రో నచ్చదు. ఒరిజినల్ తో సంబంధం లేకుండా చూస్తే, పవన్ కల్యాణ్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్ – కాస్త బెటర్ బ్రో

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links