బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి కలిసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వీళ్ల కాంబినేషన్ లో ఇది వరుసగా నాలుగో సినిమా కావడం విశేషం. సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ప్రస్తుతం పుష్ప-2 చేస్తున్నాడు బన్నీ. అటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.
వీళ్లిద్దరూ ఫ్రీ అయిన వెంటనే కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. జులాయి సినిమాతో తొలిసారి కలిశారు బన్నీ-త్రివిక్రమ్. ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశారు. అది కూడా హిట్టయింది. ఇక ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి చేసిన అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. రికార్డులన్నీ తుడిచిపెట్టింది.
ఈ సినిమాలో పాటలైతే ఇప్పటికీ పెద్ద హిట్. ఇలాంటి హిట్ మూవీ తర్వాత మరోసారి కలిసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు బన్నీ-త్రివిక్రమ్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. అల వైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ ను, కొత్త సినిమా కోసం కూడా తీసుకోబోతున్నారు.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, బన్నీ ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ సినిమాకు ఓకే చెప్పాడు. అటు లిస్ట్ లో ఐకాన్ మూవీ రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల్ని మరోసారి పక్కనపెట్టి, త్రివిక్రమ్ తో కలిసి అతడు సెట్స్ పైకి వెళ్తాడా అనేది అందరి అనుమానం. మరోవైపు మహేష్ బాబును రెచ్చగొట్టేందుకే, ఉన్నఫలంగా బన్నీతో సినిమాను ప్రకటిస్తున్నారనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగుతోంది.
ఏదేమైనా.. బన్నీ-త్రివిక్రమ్ కలిస్తే ఆ కిక్కే వేరప్పా. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి కొత్త సినిమా సెట్స్ పైకి రావాలని కోరుకుందాం..