తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
రిలీజ్: జూన్ 2
రేటింగ్: 2.75/5
రామానాయుడు మనవడు, సురేష్ బాబు చిన్న కొడుకు, దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన సినిమా అహింస. చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కొత్తవాళ్లను పరిచయం చేయడంలో మంచి హస్తవాసి కలిగిన తేజ, ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. ఇంతకీ అహింస ఎలా ఉంది? అభిరామ్ ను హీరోగా ఎస్టాబ్లిష్ చేసేంత స్టఫ్ ఇందులో ఉందా? తేజకు మరో సక్సెస్ అందించిందా?
రఘు (దగ్గుబాటి అభిరామ్), స్వాతి (గీతిక) బావమరదలు. తల్లిదండ్రులు చనిపోతే స్వాతి తల్లిదండ్రులే రఘును పెంచుతారు. రఘు అంటే స్వాతికి ప్రాణం. ఆమె కొంచెం రెబల్ గా ఉంటుంది. రఘు మాత్రం సాత్వికుడు. నీటిలో పడిన చీమను కూడా కాపాడే రకం. త్వరలోనే రఘు-స్వాతి పెళ్లి చేయాలనుకుంటారు ఆమె తల్లిదండ్రులు. అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్ లో, సిటీ నుంచి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్వాతిని రేప్ చేసి, రోడ్డు పక్కన పడేస్తారు. చావుబతుకుల్లో ఉన్న స్వాతిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు రఘు.
స్వాతికి జరిగిన అన్యాయంపై లాయర్ సదా సహాయంతో న్యాయంపోరాటం చేస్తాడు రఘు. అయితే రేప్ చేసిన ఇద్దరు వ్యక్తుల తండ్రి దుష్యంతరావు (రజిత్ బేడీ) డబ్బున్న వ్యక్తి. డబ్బుతో సాక్ష్యాల్ని కొనేస్తాడు. మరోవైపు స్వాతిని చంపే ప్రయత్నం కూడా చేస్తాడు. దీంతో స్వాతిని తీసుకొని అడవుల్లోకి పారిపోతాడు రఘు. అలా అడవుల్లోకి వెళ్లిన రఘు.. స్వాతిని ఎలా కాపాడుకున్నాడు, సాఫ్ట్ గా ఉండే రఘు, తన ప్రేయసి కోసం ఎలా రెబల్ గా మారాడు, ఆమెకు అన్యాయం చేసిన వ్యక్తులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.
తేజ సినిమాల్లో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఎమోషన్ ప్లే చేసింది. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో తన మార్క్ చూపించాడు తేజ. అయితే హీరోయిన్ చేసినంత ఈజ్ తో, హీరో చేయలేకపోయాడు. మొదటి సినిమా కావడంతో అతడి నటనలో కొన్ని లోపాలు కనిపించడం సహజం. తేజ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి అభిరామ్ తప్పకుండా షైన్ అవుతాడు. అహింస సినిమా అతడి కెరీర్ కు మంచి బేస్ మెంట్ వేసింది. ఇక హీరోయిన్ గీతక యాక్టింగ్ చూస్తే, కొత్తమ్మాయని ఎవ్వరూ అనుకోరు. అంత బాగా చేసింది. విలన్ గా నటించిన రజిత్ బేడీ, పోలీస్ గా చేసిన రవి కాలె, లాయర్ గా నటించిన సదా, హీరోయిన్ తండ్రిగా దేవిప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు హై ఎమోషన్స్ ఈ సినిమాను నిలబెడతాయి. దీనికితోడు ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం మెయిన్ ఎట్రాక్షన్. సిద్ శ్రీరామ్ పాడిన పాటతో పాటు, మరో రెండు పాటలు బాగున్నాయి. పట్నాయక్ లో మునుపటి ఫామ్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తుంది అహింస. ఇక టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు లాంటి సీనియర్లు ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు.
ఇక దర్శకుడు తేజ విషయానికొస్తే, మరోసారి తన మార్క్ చూపించాడు ఈ సీనియర్ దర్శకుడు. హై-ఎమోషన్స్ పండించడంలో దిట్ట అనిపించుకున్న ఈ దర్శకుడు, అహింసతో మరోసారి తన మార్క్ చూపించాడు. ఇది పూర్తిగా తేజ మార్క్ సినిమా. హీరోయిన్ ను కాస్త ఓవర్ గా చూపించడం, విలన్ డామినేషన్ ఎక్కువగా చూపించడం, హీరోను అమాయకంగా ప్రొజెక్ట్ చేయడం, సినిమాను అడవుల్లో పరుగులు పెట్టించడం.. ఇవన్నీ తేజ మార్క్ సీన్లు. అహింసలో అడుగడుగునా ఇవి కనిపిస్తాయి.
ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని పాయింట్ గా తీసుకొని, దానికి హీరోయిజం యాడ్ చేయడంలో తేజ సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే అతడి మార్కే, ఈ సినిమాకు అక్కడక్కడ మైనస్ కూడా అనిపిస్తుంది. తేజ గత సినిమాలు ఎలా ఉంటాయో, ఈ అహింస కూడా అలానే ఉంది. క్యారెక్టర్స్ నుంచి కథ వరకు అంతా ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ లో నడుస్తుంది. చివర్లో వచ్చిన ట్విస్ట్ మినహాయిస్తే.. ఎక్కడా తేజ నెరేషన్ లో హై కనిపించదు. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఇట్టే ఊహించుకోవచ్చు.
కాకపోతే సన్నివేశాలు రొటీన్ గా ఉన్నప్పటికీ, హై-ఎమోషన్ పండించి పాస్ అయిపోయాడు తేజ. ఓవరాల్ గా అహింస సినిమా, అప్ టు ది మార్క్ లేనప్పటికీ, ఈ వీకెండ్ ఓసారి చూడొచ్చు.