నటీనటులు – ప్రభాస్, కృతిసనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీఖాన్, దేవదత్త, సోనాల్ చౌహాన్ తదితరులు..
దర్శకుడు – ఓం రౌత్
ప్రొడ్యూసర్స్ – భూషణ్ కుమార్, కృష్ణకుమార్,
బ్యానర్లు – రెట్రోఫైల్స్, టీ-సిరీస్, యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా
సంగీతం – అజయ్ అతుల్, సంచిత్ బల్హారా,
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
ఎడిటర్ – అపూర్వ, ఆశిష్
రన్ టైమ్ – 179 నిమిషాలు
సెన్సార్ – క్లీన్ U
రిలీజ్ – జూన్ 16, 2023
రేటింగ్ – 2.75/5
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మైథలాజికల్ మూవీస్ కొత్తకాదు. మరీ ముఖ్యంగా రామాయణం, భారతం బేస్ చేసుకొని వచ్చిన సినిమాలకు కొదవ లేదు. “మాయాబజార్”, “లవకుశ” క్లాసిక్స్ గా నిలిచాయి. నిజానికి, 1970ల చివరి వరకు, తెలుగు సినిమాల్లో ఎక్కువ భాగం రామాయణం, మహాభారతంలోని కథలే కనిపిస్తాయి. ఎన్టీ రామారావు, శోభన్ బాబు, హరనాథ్‌లతో సహా చాలా మంది నటీనటులు తెరపై శ్రీరాముని పాత్రను పోషించి పాపులర్ అయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ప్రభాస్ లాంటి టాప్ హీరో రాముడి పాత్రను పోషించాడు. అందుకే ఆదిపురుష్ పై అంచనాలు పెరిగాయి.
“ఆదిపురుష్”.. వాల్మీకి రచించిన రామాయణం ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇది యథాతథ అనువాదం కాదు. ఈ కథకు దర్శకుడు ఓం రౌత్, తనదైన శైలి, కథనం ఇచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా నేటి యూత్ కు ఇష్టపడే మార్పుచేర్పులు బాగా చేశాడు. అందుకే రామరావణ యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ సినిమాను పూర్తిగా యుద్ధ సన్నివేశాలకు అంకితం చేశాడు దర్శకుడు.
ప్రస్తుతం హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలను వీక్షిస్తున్న యువ తరానికి, రామాయణం లాంటి ఇతిహాసాన్ని అదే స్టయిల్ లో చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అలా వారిని ఆకర్షించడం అతడి లక్ష్యం. దీని కోసం అతడు “వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్” వంటి హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొందాడు. రామాయణానికి పూర్తిగా హాలీవుడ్ సినిమాల లుక్ ఇచ్చాడు. సినిమాలో యుద్ధ సన్నివేశాలతో పాటు, టోటల్ సెటప్ అంతా మార్వెల్ మూవీస్, “లార్డ్ ఆఫ్ ది రింగ్స్” ఫ్రాంచైజీని గుర్తుచేస్తాయి. రావణుడి లుక్ పాటు, లంక రూపురేఖల్ని కూడా మార్చేశారు. రామాయణంలో చెప్పిన లంకలా కాకుండా.. హాలీవుడ్ సినిమాల్లో ఉండే సెట్టింగ్స్ ను లంక కోసం వాడారు.
ఓం రౌత్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కథనం పరుగులు పెడుతుంది. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయడు. బంగారు జింక కనిపించినప్పటి నుండి లంకలోకి ప్రవేశించడానికి సముద్రం మీదుగా రాముడు వంతెనను నిర్మించే వరకు, కథ, కథనం వేగంగా ఉన్నాయి. అలా సినిమా మొదటి సగం సక్సెస్ అయింది.
అయితే సెకండాఫ్ సినిమాకి పెద్ద అడ్డంకి. రాముడు, రావణుడు మధ్య జరిగే ఫైట్ సినిమా రన్ టైంలో గంటకు పైగా పడుతుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పాటు, ఇతర చిత్రాల నుండి అన్ని ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఫలితంగా, ఈ చిత్రం రామాయణం కంటే తక్కువగా ఉంటుంది మరియు ఆ సూపర్ హీరోల చిత్రాలకు అనుకరణగా మారుతుంది. అదనంగా, ఈ భాగాలలో విజువల్ ఎఫెక్ట్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. రాముడిని రాఘవ అని, సీతను జానకి అని పిలవడం కూడా అస్పష్టంగా ఉంది. మొదట్లో రామ్‌ని రాఘవ అని పిలిచినా, ఆ తర్వాత శ్రీరాముడిగా పిలుస్తుంటారు.
నటన పరంగా చూసుకుంటే, రాముడిగా ప్రభాస్ బాగా నటించాడు. దూకుడుగా, శాంతంగా బాగా మెప్పించాడు. తన ఛరిష్మాతో ఈ సినిమాను అతడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. జానకి పాత్రలో కృతి సనన్‌కి తక్కువ స్క్రీన్ టైమ్ ఉంది, కానీ ఆమె తన ఉనికిని చాటుకుంది. సైఫ్ అల్ ఖాన్ పోషించిన రావణ్ సినిమాలో మరో ప్రధాన పాత్ర. సైఫ్ ఎంత ప్రయత్నించినప్పటికీ, ఈ సినిమాలో రావణ్ పాత్ర ఎవరికీ అంతగా నచ్చలేదు. హనుమంతుడిగా దేవదత్త పర్వాలేదు.
సినిమాలో సంగీతం క్లిక్ అయింది. “జై శ్రీ రామ్” సాంగ్ ఎఫెక్టివ్ గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఊపునిచ్చింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. ఓవరాల్ గా ఆదిపురుష్ సినిమాను ఈ తరం యూత్ ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెరకెక్కించారు. రామాయణాన్ని ఇప్పటి జనరేషన్ కు పరిచయం చేయాలనే సంకల్పం కంటే, యూత్ ను ఎట్రాక్ట్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది.