ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్నాచితకా హీరోల వరకు ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇలాంటి సినిమాలున్నాయి. అయితే వాటి గురించి మాట్లాడ్డానికి హీరోలెవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలా ఆగిపోయిన కొన్ని సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ… ఏడాదికి పైగా నలిగిన సినిమా ఇది. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ నుంచి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా ఇదేనని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతా సెట్ అనుకున్న టైమ్ లో పెద్ద కుదుపు. కొరటాలతో సినిమాకు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. అటు త్రివిక్రమ్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ తో మూవీ పక్కా చేసుకున్నాడు. మరి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వస్తుందా రాదా?
మహేష్-సుకుమార్ సినిమా పరిస్థితి కూడా ఇదే. రీసెంట్ గా ఆగిపోయిన సినిమాల లిస్ట్ లో ఇది కూడా ఉంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ తో మూవీ ఎనౌన్స్ చేశాడు సుక్కూ. స్టోరీ డిస్కషన్లు కూడా జోరుగా సాగాయి. అంతలోనే ఏమైందో ఏమో సుకుమార్ డ్రాప్ అయ్యాడు. బన్నీతో పుష్ప సినిమా ప్రకటించాడు. ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి “క్రియేటివ్ డిఫరెన్సెస్” అనే ముద్దుపేరు పెట్టుకున్నారు.
రామ్ చరణ్-కొరటాల మూవీ కూడా ఇంకా సెట్ కాలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వినయ విధేయ రామ సినిమా కంటే ముందే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి రావాలి. ముహూర్తం షాట్ కూడా కొట్టిన తర్వాత ఆగిపోయింది. కాస్త గ్యాప్ తీసుకొని చిరంజీవితో ఆచార్య సినిమా చేశా కొరటాల. మరి రామ్ చరణ్ తో ఎప్పుడు చేస్తాడో.?
వెంకటేష్-కిషోర్ తిరుమల సినిమా కూడా ఆగిపోయింది.. ఈ సినిమాకైతే పేరు కూడా పెట్టేశారు. ఆడాళ్లు మీకు జోహార్లు అనేది టైటిల్. ఫైనల్ నెరేషన్ కూడా పూర్తయిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టును వెంకటేష్ చేయలేడు. ఎందుకంటే, ఇదే కథ-టైటిల్ తో శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల సినిమా చేశాడు. మళ్లీ వెంకీ-కిషోర్ ఎప్పుడు కలుస్తారో?
వెంకటేష్-తేజ సినిమా కూడా ఇంతే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వెంకీ ప్రీ-లుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. స్టార్స్ తో తను సినిమాలు చేయలేననే విషయాన్ని దర్శకుడు తేజ, ఈ ప్రాజెక్టుతో మరోసారి నిరూపించుకున్నాడు.
రానా చేయాల్సిన హిరణ్యకశ్యప సినిమా కూడా దాదాపు ఆగిపోయినట్టే. రానా-గుణశేఖర్ కాంబినేషన్ లో రావాల్సిన ఈ ప్రాజెక్టు, త్రివిక్రమ్ చేతికి వెళ్లినట్టు వార్తలొత్తాయి. ఈ గ్యాప్ లో సమంతతో శాకుంతలం సినిమా చేశాడు గుణశేఖర్. మరి త్రివిక్రమ్ నుంచి హిరణ్యకశిప ఎప్పుడొస్తుందో?
అల్లు అరవింద్ చేయాల్సిన రామాయణం కూడా ఏళ్లుగా నలుగుతోంది. 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రకటించారు. ఆ వెంటనే దాని సంగతి మరిచిపోయారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పేరెత్తితే కచ్చితంగా వస్తుందంటారు నిర్మాత అల్లు అరవింద్. కానీ ఆడియన్స్ కు మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి.
నిఖిల్ కెరీర్ లో కూడా ఆగిపోయిన సినిమాలున్నాయి. అందులో ఒకటి శ్వాస. ఈ సినిమా షూటింగ్ కూడా నడిచింది. హీరోయిన్ గా నివేత థామస్ ను తీసుకున్నారు. వీళ్లిద్దరిదీ మంచి కాంబినేషన్ అనుకున్నారు అప్పట్లో. అంతలోనే ఆ ప్రాజెక్టు నుంచి నిఖిల్ తప్పుకోవడం, సినిమా ఆగిపోవడం చకచకా జరిగిపోయాయి.
విశ్వక్ సేన్, అర్జున్ సినిమా కూడా ఇలానే ఆగిపోయింది. గ్రాండ్ గా లాంచ్ చేశారు. షెడ్యూల్స్ కూడా వేశారు. కానీ విశ్వక్ మాత్రం సెట్స్ పైకి రాలేదు. చాలా రోజులు ఎదురుచూసి ఈ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాడు అర్జున్. దీనికి సంబంధించి చిన్న వివాదం కూడా రేగిన సంగతి గుర్తుండే ఉంటుంది.
నాని-హను రాఘవపూడి సినిమా అయితే ప్రకటన కూడా రాకుండానే ఆగిపోయింది. స్వయంగా నాని ఈ సినిమాను ఎనౌన్స్ చేశాడు. కానీ అతడే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడు. అలా వాయిదాల మీద వాయిదాలు చూసిన ఈ సినిమా ఇక సెట్స్ పైకి వచ్చేలా లేదు.
మహేష్-పూరి కాంబినేషన్ లో రావాల్సిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది. దీనికి సంబంధించి టైటిల్ లోగో కూడా బయటకొచ్చింది. పూరి అయితే ఓ డైలాగ్ కూడా రివీల్ చేశాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో సినిమా ఆగిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇదే ప్రాజెక్టును విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేశాడు పూరి. అది కూడా ఆగిపోయింది.
చిరంజీవి, పూరి జగన్నాధ్ సినిమా కూడా ఆగిపోయింది. దీని పేరు ఆటోజానీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి రీఎంట్రీ మూవీగా ఆటోజానీ రావాల్సి ఉంది. కానీ పూరి జగన్నాధ్ చెప్పిన ఈ సినిమా కథలో సెకెండాఫ్ నచ్చలేదని చిరంజీవి ఈ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చేశారు. అప్పట్నుంచి ఈ కథ, పూరి దగ్గర అలాగే ఉండిపోయింది.