2018 Movie Review – 2018 మూవీ రివ్యూ

నటీనటులు: టోవినో థామస్, లాల్, నరైన్, అపర్ణ బాలమురళి, కళైరసన్, అజు వర్గీస్, వినీత్ శ్రీనివాసన్, కుంచాకో బోబన్ తదితరులు
దర్శకులు : జూడ్ ఆంథనీ జోసెఫ్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
సంగీత దర్శకులు: నోబిన్ పాల్
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
ఎడిటర్: చమన్ చక్కో
సెన్సార్: UA
రన్ టైమ్: 2గంటల 30నిమిషాలు
రిలీజ్ డేట్: మే 26, 2023
రేటింగ్: 3.5/5

కంటెంట్ పై నమ్మకంతో విడుదలకు ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా ఇదే కోవలో 2018 అనే సినిమాను రిలీజ్ కు 24 గంటల ముందే షోలు వేశారు. కొంతమంది ప్రేక్షకులతో పాటు, మీడియాకు ప్రత్యేకంగా షోలు వేశారు. శుక్రవారం పూర్తిస్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంది? TeluguNews360 ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కొన్ని కథల్ని సినిమాలుగా తీయడానికి సాహసం కావాలి. అలాంటి సాహసోపేత కథలు మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా వచ్చిన 2018 సినిమా కూడా అలాంటిదే. ఐదేళ్ల కిందట కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని వరదల్ని అద్భుతంగా సృష్టించొచ్చు. కానీ మేకర్స్ ఆ పని చేయలేదు. ఎక్కువ సన్నివేశాల్ని సహజ పద్ధతిలోనే తీయాలనుకున్నారు. అందుకే మూడున్నరేళ్లు టైమ్ తీసుకున్నారు. అక్కడక్కడ గ్రాఫిక్స్ వాడినప్పటికీ ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

ఫలితంగా అత్యంత సహజంగా తెరకెక్కిన 2018 సినిమా, ప్రేక్షకుడ్ని ఎమోషనల్ గా కదిలిస్తుంది. వరదల్లో జనాలు చనిపోతుంటే, ప్రేక్షకుడు చప్పట్లు కొట్టడం ఈ సినిమాలోనే చూస్తాం. అంతటి అద్భుతమైన మేకింగ్ ఈ సినిమాలో చూడొచ్చు. ముందుగా కథ ఏంటో చెప్పుకుందాం.

కేరళలోని అరువిక్కళం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. సహజంగా జనాల మధ్య ఉండే అభిప్రాయబేధాలు ఆ ఊరిలో కూడా ఉంటాయి. అదే ఊరిలో అనూప్ (టొలినో థామస్) అనే కుర్రాడు ఏదో పొడిచేద్దామని ఆర్మీకి వెళ్తాడు. అక్కడ పరిస్థితులు తట్టుకోలేక దొంగ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి ఊరికి వచ్చేస్తాడు. అతడ్ని చూసి ఊరి జనం నవ్వుతుంటారు. ఇలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. అలాంటి పరిస్థితుల్లో ఊరికి వరద వస్తుంది. ఇంటిపైకప్పు వరకు నీరు వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల నుంచి ఆ ఊరి ప్రజలు ఎలా బయటపడ్డారు, ఎవరి కష్టం ఏంటి అనే విషయాల్ని ఈ సినిమాలో చూపించారు.

ఇదేదో మిస్టరీ సబ్జెక్ట్ కాదు, థ్రిల్లర్ అంతకంటే కాదు, మాస్-మసాలా యాక్షన్ సినిమా కాదు. కేవలం వరదల నేపథ్యంలో కలిగిన కష్టాల్ని ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం మాత్రం చేశారు. ఇదే అతికష్టమైన జాబ్. ఈ విషయంలో దర్శకుడు జూడ్ ఆంటోనీ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాలో ఒక్కో పాత్ర గుండెల్ని పిండి చేస్తుంది. అలాంటివి ఓ 5-6 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిని చూస్తే గొంతు తడారిపోతుంది. కన్నీళ్లు వస్తాయి. అంత హృద్యంగా, అత్యంత సహజంగా తెరకెక్కంది 2018 సినిమా.

తుపాను ముందు వాతావరణం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, వరదల ముందు ఈ సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. సినిమా ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి అసలు సినిమా కనిపిస్తుంది. ఇన్నాళ్లూ వార్తల్లో మాత్రమే వరదల్ని చూసిన చాలామంది ప్రేక్షకులు, ఈ సినిమాలో వరద దృశ్యాల్ని చూసి షాక్ అవుతారు. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుడుతుంది. రోజుల తరబడి వర్షం కురవడం, ఇళ్లు మునగడం, మనుషులు కొట్టుకుపోవడం, డబ్బులు పోవడం, కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోవడం, సర్టిఫికెట్లు తడిచిపోవడం, తాగడానికి నీరు లేకపోవడం, కరెంట్ లేక అవస్థలు.. ఇవన్నీ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించవు, మన కళ్లముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

తమ ప్రజల్ని కాపాడేందుకు కేరళ మత్స్యకారులు సముద్రం నుంచి బోట్లు వేసుకొని గ్రామంలోకి రావడం, వాళ్లు పడిన శ్రమ, ఎవరో తెలియని వాళ్ల కోసం వాళ్లు ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొనడం లాంటి సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ఇలా చెప్పుకుంటూపోతే సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. దేన్నీ తక్కువ చేసి చూడలేం. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం కంటే, సినిమా చూసి అనుభూతి చెందాల్సిందే.

ఈ మూవీ ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం టెక్నీషియన్లు. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ అదిరింది, ఇక నోబిన్ పాల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాలో మనల్ని లీనం అయ్యేలా చేసింది. దీనికితోడు ఆర్ట్ డిపార్ట్ మెంట్ చేసిన మూడేళ్ల కృషి ఈ సినిమాను ఉన్నతంగా నిలబెట్టింది. వరదలతో కూడిన గ్రాఫిక్ సినిమాలు హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. చాలామంది ప్రేక్షకులు వాటిని చూసే ఉంటారు. కానీ 2018 సినిమా అంతకుమించి. ఇందులో గ్రాఫిక్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ. ఇక నటీనటుల్లో ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రతి నటుడు బెస్ట్ ఇచ్చారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ లో ఎవ్రీ వన్ ఈజ్ హీరో అని చెప్పారు. ఆ ట్యాగ్ లైన్ కు తగ్గట్టే, సినిమాలో ప్రతి నటుడు అద్భుతంగా చేశారు. చివరికి ముక్కుమొహం తెలియని మత్స్యకారుల పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది.

ఓవరాల్ గా 2018 సినిమా ఓ మంచి ఎమోషనల్ రైడ్ అందిస్తుంది. మనం కూడా వరదల్లో చిక్కుకున్నామనే భావన కలిగిస్తుంది. ఇది చాలు సినిమా హిట్టయిందని చెప్పడానికి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400