సామాజికి మాధ్యమాలకు ప్రస్తుత జనరేషన్ ఎంతో ఎడిక్ట్ అయ్యింది. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి తలెత్తింది. అయితే సోషల్ మీడియా మోజులో పడిన తల్లిదండ్రులు ఐఫోన్ కోసం ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే… పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. కొద్దిరోజులుగా వారి కుమారుడు కనిపించకపోవడంపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీనికితోడు ఆ దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గుర్తించారు.
అయితే పసికందు గురించి స్థానికులు ప్రశ్నించగా.. ఖారాహ్ ప్రాంతంలో నివసించే ప్రియాంక అనే మహిళకు అమ్మేసినట్లు జయదేవ్, సాథి తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు చెప్పారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారించారు. కుమార్తెను కూడా అమ్మేందుకు జయదేవ్ ప్రయత్నించాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని స్థానిక కౌన్సిలర్ తారక్ గుహ పేర్కొన్నారు.