ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్ డబుల్ 1000 మీటర్ల రేసులో అర్జున్ సింగ్, సునీల్ సింగ్ జట్టు కూడా కాంస్యం సాధించింది. వీరిద్దరు 3 నిమిషాల 53 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆర్చరీ విభాగంలో పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు ఒజాస్, అభిషేక్ తలపడనున్నారు. దీంతో వారిద్దరిలో ఎవరు గెలిచినా భారత్‌కు స్వర్ణం, సిల్వర్ దక్కనుంది. మరోవైపు మహిళల 800 మీటర్ల రేసులో కుమారి చంద, హర్మిలన్ బైన్స్ ఫైనల్‌కు అర్హత సాధించారు. అలాగే 4 x400m మీటర్ల రేసులోనూ పురుషుల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యశస్వీ జైశ్వాల్ మెరుపు శతకం సాధించడంతో తొలుత టీమిండియా నాలుగు వికెట్లకు 202 పరుగులు చేసింది. జైశ్వాల్ 49 పరుగుల తేడాతో 100 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ రికార్డు కూడా సాధించాడు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆఖర్లో రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించడంతో జట్టు స్కోరు 200 దాటింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. అయితే మైదానంలో షార్ట్ బౌండరీలు ఉండటంతో ఇరు జట్ల బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.