మరో మూడు రోజుల్లో క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో ‘2023 వన్డే ప్రపంచకప్’ జరగనుంది. పుష్కరం తర్వాత ఈ మెగాటోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటిలాగే టీమిండియానే ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. మరి దశాబ్దాల కల ‘కప్ కరవు’ను ఈ సారి అయినా టీమిండియా తీరుస్తుందా??
ఇప్పటివరకు 12 సార్లు వన్డే ప్రపంచకప్‌లు జరిగాయి. 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలో, 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత్ కప్‌ను ముద్దాడింది. 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీని టీమిండియా గెలిచింది. ఆ తర్వాత మెగా ఐసీసీ ట్రోఫీలను భారతజట్టు సాధించలేకపోయింది. ధోనీ, కోహ్లి, రోహిత్.. ఇలా కెప్టెన్సీలో మార్పులు వచ్చినా అదే రిజల్ట్ వచ్చింది.
2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ వరకు, 2015 వన్డే వరల్డ్‌కప్, 2016 టీ20 ప్రపంచకప్‌ల్లో సెమీస్ వరకు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వరకు, 2019 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో మరోసారి సెమీస్ వరకు చేరి కప్‌ను చేజార్చుకుంది. వీటితో పాటు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు రెండు సార్లు చేరి ఆఖరిమెట్టులో బోల్తాపడింది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. గ్రూప్ దశలో అంచనాలు పెంచుతూ నాకౌట్‌లో తడబడుతూ టీమిండియా ఉస్సూరమనిపిస్తోంది.
1983లో కెప్టెన్ కపిల్‌దేవ్, ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ హీరోయిజం చూపించారు. దీంతో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అమర్‌నాథ్ 237 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టి విజయాల్లో కీలకపోషించాడు. ఇక 2011లో ధోనీ వ్యూహాలు, యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ షో.. ప్రత్యర్థులను మట్టికరిపించేలా చేశాయి. 362 పరుగులు, 15 వికెట్లను యువీ సాధించి తానెంత విలువైన ఆటగాడో ప్రపంచానికి చాటిచెప్పాడు. మరోవైపు ధోనీ తీసుకున్న నిర్ణయాలు ఎవరి ఊహకు అందనవి. ఫైనల్లో వికెట్ల దాహంతో ఉన్న వెటరన్ స్పిన్నర్ మురళీధరన్‌ను నిలువరించడానికి.. యువీని కాదని ధోనీనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చాడు. ఫైనల్లో అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోవడమంటే సాహసమే. అయినా ధోనీ ఆ నిర్ణయాన్ని తీసుకుని 28 ఏళ్ల భారత్ కలను తీర్చాడు.
ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా ఉంది. బెంచ్ సామర్థ్యంతోనే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగితే అది ప్రత్యర్థిజట్టుకు పెనుసవాలే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభమన్‌గిల్‌తో టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. గాయాల నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. ఇక వీరంతా క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారాల్సిందే. వారితో పాటు నిఖార్సెయిన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, రవీంద్రజడేజా జట్టులో ఉండటం టీమిండియాకు మరో సానుకూలాంశం. ఇలాంటి భీకర బ్యాట్స్‌మెన్ మన జట్టులో ఉండటంతో భారీ స్కోరులు సాధించడం సాధారణంగా మారింది.
మరోవైపు బౌలింగ్ విభాగంలోనే భారత్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా, నిప్పులుచెరిగే బంతులు విసిరే సిరాజ్, షమితో పేస్‌దళం పటిష్టంగా ఉంది. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్య బ్యాట్స్‌మెన్‌ను బెంబెలెత్తించగలరు. ఇక స్పిన్‌లో కుల్‌దీప్ యాదవ్, సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా ఉన్నారు. బంతిని గింగరాలు తిప్పుతూ.. బ్యాట్స్‌మెన్‌కు తిప్పలు పెట్టంలో వీరంతా ఆరితేరిన వారు. దీంతో టీమిండియా మరోసారి హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
అయితే భారత్‌కు మరో సెంటిమెంట్ కూడా ఈసారి కలిసొస్తుంది. చివరి మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆతిథ్య జట్లే ఛాంపియన్‌గా నిలిచాయి. 2011లో టీమిండియా, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ విజేతలుగా నిలిచాయి. ఈ సారి భారత్ ఆతిథ్యం ఇవ్వడంతో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు టీమిండియాకు సవాళ్లుగా మారాయి. ఐసీసీ ట్రోఫీల్లో ఆస్ట్రేలియా అనూహ్యరీతిలో చెలరేగిపోతుంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లతో ప్రమాదకరంగా ఉంది. ఈ జట్లలోని కీలక ఆటగాళ్లకు భారత్ పిచ్‌లపై అపారమైన అనుభవం ఉంది. వారిని నిలువరించాలంటే టీమిండియా ప్రత్యేకమైన వ్యూహాలు రచించాల్సిందే. అయితే మన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను కెప్టెన్ రోహిత్ ఎలా ఉపయోగించుకుంటాడనేదే ఆసక్తికరం. అలాగే ఇప్పటివరకు విజేతగా నిలిచిన జట్లలో ఆల్‌రౌండర్లే హీరోలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే జడేజా బంతితో మెరుస్తున్నా తన బ్యాటుకు పూర్తిస్థాయిలో పనిచెప్పాల్సి ఉంది. అంతేగాక నాకౌట్‌లో టీమిండియా సత్తాచాటాల్సి ఉంది. అధిక ఒత్తిడితో కీలక నాకౌట్‌మ్యాచ్‌ల్లో టీమిండియా గత కొంతకాలంగా వెనుదిరుగుతుంది. ఈ సారి ఒత్తిడిని దాటుకుంటూ.. అంచనాలను అందుకుంటూ.. భారత్ నిలవాలి.. గెలవాలని దేశమంతా ఆశిస్తోంది.