భారత్ వేదికగా జరగనున్న ‘ప్రపంచకప్ 2023’ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. వరల్డ్ కప్‌ను ‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన ప్రీ రికార్డింగ్ ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఖలిస్థాని ఉగ్రవాది నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా కెనడా నుంచి కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు భారత్‌కు చేరుకున్నారని పన్నూ ఆడియోలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైం డీసీపీ అజిత్ రాజియన్ పేర్కొన్నారు.
ఇటీవల ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనతో కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా.. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎస్‌ఎఫ్‌జే ప్రయత్నిస్తోంది. కాగా, అక్టోబర్ 5న గుజరాత్‌లో మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు భారత్‌కు చేరుకున్నాయి.