ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడుతుంటారు. ఇక కళ్లుచెదిరే సిక్సర్లు, వికెట్లు ఎగిరిపడే బంతులు, అబ్బురపడిచే క్యాచ్‌లు, ఆటగాళ్ల కవ్వింపులు.. ఇలా మెగాటోర్నీలో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత విందు ప్రతిసారి అందుతూనే ఉంది. అయితే ఈ సారి మన దేశంలోనే వన్డే ప్రపంచకప్ జరగనుండటం మరో ప్రత్యేకత. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా సమరం ప్రారంభం కానుంది. ప్రతిసారిలానే టీమిండియా హాట్ ఫేవరేట్‌గా మరోసారి బరిలోకి దిగుతుంది. మరి 1983లో కపిల్ డెవిల్స్, 2011లో ధోనీసేన తరహాలోనే రోహిత్ బృందం కూడా కప్‌ను అందిస్తుందా? ప్రత్యర్థులను ఓడించడానికి మన దగ్గర ఉన్న వ్యూహాలేంటి? మన ఆటగాళ్ల బలాలేంటి? బలహీనతలేంటి? సెంచరీల మోత, వికెట్ల వేట, ఆల్‌రౌండ్ షోలనూ టీమిండియా ప్లేయర్లు ప్రదర్శిస్తారా?
క్రికెట్ చాణిక్యుడు మహేంద్రసింగ్ ధోనీ తర్వాత భారత జట్టు పగ్గాలను విరాట్ కోహ్లి అందుకున్నాడు. అంచనాలకు తగ్గట్లుగానే కోహ్లి కెప్టెన్సీలో అదరగొట్టాడు. విదేశాల్లోనూ ప్రత్యర్థిజట్లను భయపెట్టే ‘నయా ఇండియా’ను తయారుచేశాడు. కానీ ఐసీసీ ట్రోఫీలను సాధించడంలో మాత్రం విరాట్ విఫలమయ్యాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమితో కోహ్లి నేతృత్వంలో కప్‌లు చేజారడం మొదలైంది. ఫైనల్లో టాస్ గెలిచి విరాట్ బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని విశ్లేషకులు తీవ్రంగా తప్పుబట్టారు. అప్పట్లో దానిపై చర్చ గట్టిగానే సాగింది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లిసేన ఓటమిపాలైంది. అప్పుడు ఆటగాళ్ల వైఫల్యంతో పాటు దురదృష్టం మనల్ని వెంటాడింది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. దీంతో కోహ్లిపై ఒత్తిడి అమాంతం పెరిగింది. బీసీసీఐ పెద్దలు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లిని కెప్టెన్సీ నుంచి వైదొలగాలని చెప్పారు. విరాట్ అన్ని ఫార్మాట్‌ల నుంచి సారథిగా తప్పుకున్నాడు. మరోవైపు ఐపీఎల్ ట్రోఫీలతో సత్తాచాటిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు జట్టు బాధ్యతలు అప్పగించారు.
ప్రపంచకప్‌ను గెలవాలంటే ఒక్క ఆటగాడు గొప్ప ప్రదర్శన చేస్తే సరిపోదని చరిత్ర ఇప్పటికే చెప్పింది. జట్టు సమష్టిగా పోరాడితేనే విజేతగా నిలుస్తుంది. ఇక జట్టులో కెప్టెన్ బాధ్యతలు అత్యంత కీలకం. ఏ ఆటగాడిని ఎప్పుడు ఉపయోగించాలి, పరుగుల కట్టడికి, వికెట్ల వేటకు ఫీల్డింగ్‌ను ఎలా మొహరించాలి, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఎలా నింపాలి అనేవి.. సారథి కర్తవ్యాలు. మరి ఈ సారి రోహిత్ శర్మ సొంతగడ్డపై తన జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి జట్టుకు తగ్గట్లుగా వ్యూహాలు రచించడం, ధోనీలా మైదానంలో ప్రశాంతంగా ఉండటం హిట్‌మ్యాన్‌కు అలవాటే.
అయితే కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ జట్టుకు చాలా అవసరం. 2011లో ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కకపోవడంపై కుమిలిపోయిన రోహిత్.. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌గా మారాడు. పరుగుల వరద పారిస్తూ జట్టుకు విజయాలు అందించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో శతకాల మోత మోగించాడు. అయిదు శతకాలతో, 81 సగటుతో 648 పరుగులు చేశాడు. భారత్ విజేతగా నిలవాలంటే రోహిత్ ఇదే తరహా బ్యాటింగ్ ప్రదర్శించాలి. కానీ రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఇటీవల చాలా తక్కువగా వస్తున్నాయి. అంతేగాక అతడి బ్యాటింగ్ విధానం పూర్తిగా మారింది. అయితే ఇటీవల ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్‌లో హిట్‌మ్యాన్ తన లయను అందుకోవడం ఊరట కలిగించే అంశం. అదే జోరు మెగాటోర్నీలోనూ ప్రదర్శిస్తే పరుగుల వరద ఖాయం. అయితే రోహిత్‌కు ఇష్టమైన పుల్‌షాట్‌ను ప్రత్యర్థి జట్లు తమ అనుకువుగా వాడుకుంటున్నాయి. రోహిత్‌తో అలాంటి షాట్లు ఆడించే ప్రయత్నాలు చేసి వికెట్‌ను సాధించుకుంటున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి వలను హిట్‌మ్యాన్ ఛేదించాలి.
యువ బ్యాటర్ శుభమన్ గిల్.. అతడు మరో విరాట్ కోహ్లి అవుతాడని మాజీలు కొనియాడుతున్నారు. క్లాసిక్, విధ్వంసం కలయికతో పరుగుల దాహం తీర్చుకుంటున్నాడు. ఈ ఏడాదిలో 20 వన్డేలు ఆడిన అతడు అయిదు శతకాలు సాధించాడు. 73కు పైగా సగటుతో రన్స్ చేస్తున్నాడు. టీమిండియాకు మరో ప్లస్ పాయింట్.. ‘గిల్-రోహిత్’ సూపర్ హిట్ భాగస్వామ్యం. ఈ జోడి ఆడిన 13 వన్డేల్లో 87 సగటుతో 1048 పరుగులు చేసింది. దీనిలో అయిదు శతకాలు, నాలుగు అర్ధశతకాల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోరులు సాధించాలన్నా, భారీ టార్గెట్‌లు ఛేదించాలన్నా ఓపెనర్లు గొప్ప ప్రారంభాన్ని ఇవ్వాలి. వీరిద్దరూ వ్యక్తిగతంగా, జోడీగా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు బలమే.
జట్టుకు అపూర్వ విజయాలు అందించన విరాట్ కోహ్లికి ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్‌గా అభిమానులు, మాజీలు భావిస్తున్నారు. దశాబ్దానికి పైగా జట్టుకు వెన్నెముకగా నిలిచిన విరాట్ ఈ ప్రపంచకప్‌లోనూ గొప్పగా పోరాడాలి. 2016లో కోహ్లి ఉన్న భీకర ఫామ్‌కు రికార్డులెన్నో బద్దలయ్యాయి. అదే తరహా బ్యాటింగ్ తీరును ఈ వరల్డ్‌కప్‌లో ప్రదర్శిస్తే భారత్‌కు తిరుగుండదు. కరోనా బ్రేక్ తర్వాత తన ఫామ్ కోసం ఎన్నో నెలలు ఎదురుచూసిన కోహ్లి ఎట్టకేలకు తన లయను తిరిగి అందుకున్నాడు. ఈ ఏడాది అయిదు శతకాలతో జోరు మీదున్నాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ల మధ్య డబుల్స్ తీస్తూ, సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచుతున్నాడు. అంతేగాక పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించడంలో కోహ్లి దిట్ట. అయితే ఈ మెగాటోర్నీలో బ్యాటింగ్‌తో పాటు తన కెప్టెన్సీ అనుభవాన్ని రోహిత్‌కు కోహ్లి అందివ్వాలి. సంక్లిష్ట పరిస్థితుల్లో తన అపారానుభవంతో జట్టును ఆదుకోవాలి. ”కోహ్లి గోస్ డౌన్ ద గ్రౌండ్.. కోహ్లి గోస్ ఔట్ ఆఫ్ ద గ్రౌండ్” వంటి ఇన్నింగ్స్‌ను మరోసారి ఆడాలి.
2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి నాలుగో స్థానంలో సరైన ప్లేయర్ లేకపోవడమూ ఓ కారణం. అయితే గాయాల నుంచి కోలుకుని కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడం, వారిద్దరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలంగా మారింది. అయితే శ్రేయస్ అయ్యర్ బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. ప్రత్యర్థి జట్లు ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీల్డర్లను మొహరించి అతడి వికెట్‌ను తీస్తున్నాయి. ఇక బ్యాటింగ్‌లో రాణిస్తున్న కేఎల్ రాహుల్ పూర్తిసామర్థ్యంతో వికెట్‌కీపింగ్ చేయలేకపోతున్నాడు. అతడి నుంచి మెరుపు స్టెంపింగ్, డైవ్ చేస్తూ క్యాచ్‌లను అందుకోవడాన్ని జట్టు ఆశిస్తుంది.
మెగాటోర్నీలో విధ్వంసకర బ్యాటర్లు చాలా కీలకం. కాసేపు క్రీజులో ఉన్నా చేయాల్సిన విధ్వంసం చేసి వారు వెళ్తుంటారు. భారత జట్టులో ఇలాంటి మాన్సర్ట్స్ .. ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఉన్నారు. ఆది నుంచే ఎదురుదాడి చేయడం ఇషాన్, సూర్యకు అలవాటు. కాస్త కుదురుకున్న తర్వాత విరుచుకుపడటం హార్దిక్ స్టైల్. అయితే నిలకడలేమి బ్యాటింగ్ వీరికి సమస్యగా మారింది. టీ20 ర్యాకింగ్‌లో నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్య… వన్డేల్లో గొప్ప ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. ఇషాన్‌ది అదే పరిస్థితి. మరోవైపు హార్దిక్ ఫినిషర్‌గా జట్టుకు ఉపయుక్తంగా ఉండాలి. ధోనీలా అలవోకగా సిక్సర్లు బాదడం హార్దిక్‌కు అలవాటే. కానీ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించే బాధ్యత ఈ సీనియర్‌పై ఉంది. ఈ ముగ్గురు జట్టులో ఎంతో ఇంపాక్ట్ చూపించగలరు.
ట్రోఫీ సాధించాలంటే ఆల్‌రౌండర్ హీరోలు జట్టుకు ఎంతో అవసరం. మొహిందర్ అమర్‌నాథ్, యువరాజ్ సింగ్ గొప్ప పోరాటమే ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిందంటే అతియోశక్తి కాదు. ఈ సారి హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా అదే మ్యాజిక్‌ను చేయాల్సి ఉంది. బ్యాటర్, స్పిన్నర్, ఫీల్డర్‌గా జడేజా జట్టుకు ఎంతో చేయాల్సి ఉంది. అయితే ఇటీవల జడ్డూ నుంచి మెరుపు ఇన్నింగ్స్‌ల్లేమి రాలేదు. అతడు బ్యాటుతో రాణించాల్సి ఉంది. మరోవైపు హార్దిక్‌ది అదే పరిస్థితి. కట్టర్స్, స్వింగర్స్‌తో బ్యాటర్లను అతడు బోల్తాకొట్టిస్తున్నా సిక్సర్ల వర్షం కురిపించలేకపోతున్నాడు. సీనియర్లు అయిన వీరిద్దరూ బ్యాటింగ్‌లో కుదురుకుంటే టీమిండియా బ్యాటింగ్ మరింత పటిష్టంగా ఉంటుంది.
బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ టీమిండియా ఫేవరేట్‌గా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమితో పేస్ దళం పటిష్టంగా ఉంది. గాయం నుంచి కోలుకుని బుమ్రా జట్టులోకి తిరిగిరావడం భారత్‌కు గొప్ప సానుకూలాంశం. అతడు జట్టులో ఉంటే ఎంతో ప్రభావం చూపగలడు. డెత్‌ఓవర్లలో స్పెషలిస్ట్ అయిన బుమ్రా వేసే యార్కర్లకు బ్యాటర్ల వద్ద సమాధానం దొరకట్లేదు. అందుకే మెగాటోర్నీలో అతడు అందుబాటులో ఉండాలని బీసీసీఐ ముందు నుంచే ప్రణాళిక రచించింది. అతడికి ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తపడింది.
మరోవైపు హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌గా ఉన్నాడు. పిచ్ కాస్త పేస్‌కు అనుకూలిస్తే సిరాజ్‌ను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే. అతడు వేసే బంతుల్ని వదిలితే వికెట్లు ఎగరడం, ఆడితే స్లిప్స్‌లోకి క్యాచ్‌లు వెళ్లేలా అతడు చెలరేగిపోతాడు. వీరిద్దరికి తోడుగా షమి జట్టులో ఉంటే ప్రత్యర్థులకు వణుకే. గతేడాది నుంచి పవర్‌ప్లేలో వికెట్లు సాధించిన జట్లలో భారత్ నంబర్‌వన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌ల్లో 80 వికెట్లు పడగొట్టారు. రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ 58 వికెట్లే పడగొట్టింది. ఈ ఉదాహరణతో మన పేసర్ల ప్రదర్శన ఏ స్ధాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడానికి కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవించంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఈ స్పిన్ అస్త్రాలకు తోడుగా శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్య జట్టులో ఉన్నారు. ఒక ఎండ్ నుంచి కుల్‌దీప్, జడేజా దాడి చేస్తూ.. మరోఎండ్ నుంచి హార్దిక్, శార్దూల్ పేస్ వేస్తే ప్రత్యర్థులు ముప్పతిప్పలు పడాల్సిందే. 2022 నుంచి మిడిల్ ఓవర్లలో కుల్‌దీప్ 41 వికెట్లు, శార్దూల్ 28, జడేజా 16 వికెట్లు పడగొట్టారు. ఎకానమీ పరంగానూ మెరుగైన రికార్డు సాధించారు.
అయితే వన్డే ప్రపంచకప్ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన అశ్విన్ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, విలియమ్సన్, బెన్‌స్టోక్స్, డేవిడ్ మిల్లర్, డికాక్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు టోర్నీలో చాలా ప్రమాదకరం. ఈ ప్లేయర్లను బోల్తాకొట్టించడంలో అశ్విన్‌కు గొప్ప రికార్డు ఉంది. అంతేగాక ఎడమచేతి వాటం బ్యాటర్ల వికెట్లు తీయడంలో యాష్ స్టైలే వేరు. ఈ వెటరన్ స్పిన్నర్ అవసరమైతే బ్యాటుతోనే రాణించగలడు. 37 ఏళ్ల అశ్విన్ తన కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు. జట్టును విశ్వవిజేతగా నిలబెట్టడంలో యాష్ తనవంతు పాత్ర పోషిస్తే అతడికి ఇంతకంటే గొప్ప ఫేర్‌వెల్ మరొకటి ఉండదు.
అయితే టీమిండియాకు మరో సవాళ్లు టోర్నీ మధ్యలో ఆటగాళ్లు గాయపడటం, నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడటం. 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ గాయాల బాధ తీరని వ్యథగా మారింది. సూపర్‌ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్, భువనేశ్వర్ గాయాలతో టోర్నీ నుంచి వైదొలగడం జట్టుకు ఎదురుదెబ్బలా తగిలింది. ఇక లీగ్, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో చెలరేగిపోయే భారత జట్టు కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓడటం సాధారణంగా మారింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగడంతో ఆటగాళ్లపై అధిక ఒత్తిడి ఉంటుంది. వాటిని అధిగమించడానికి కెప్టెన్ రోహిత్‌తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కృష్టి చేయాల్సి ఉంది. మానసిక ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడుతూ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునే బాధ్యత వారిద్దరిపైనే ఉంది. అయితే ఇతర జట్లలో మ్యాచ్ విన్నర్లు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ టీమిండియాలో ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నర్లే. ఒకరిద్దరు క్రీజులో నిలిచినా పరుగుల వరద పారడం ఖాయం. బౌలింగ్‌లోనూ అంతే. ఒకరు చెలరేగినా ప్రత్యర్థి జట్టు కుప్పకూలుతుంది. ఈ బలాలను ఉపయోగించుకుంటూ బలహీనతలను అధిగమిస్తే భారతే విశ్వవిజేతగా నిలుస్తుంది.