మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కొద్దిరోజులుగా బీజేపీలో చర్చగా ఉన్నారు. పలు సందర్భాల్లో.. అనేక కీలక ఉదంతాల్లో వివేక్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఆయన వ్యవహారశైలి. తాజాగా ఆదిలాబాద్ అమిత్ షా జనగర్జన సభలో కనిపించిన ఓ సన్నివేశం కూడా ఆ చర్చకు మరింత ఊతం ఇచ్చినట్టు అయ్యింది. ఇంతకీ షా సభలో ఏం జరిగింది?
ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరు. మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ను వీడి.. గులాబీ గూటికి వెళ్లిన వివేక్.. అక్కడ ఎక్కువ కాలం ఇమడ లేకపోయారు. బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకొన్నారు. 2018 తర్వాత తెలంగాణలో జరిగిన వివిధ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీకి తెరవెనుక చాలా సపోర్ట్ చేశారని చెబుతారు. వ్యూహ రచనలో.. మరెంతో సాయం చేయడంలో వివేక్‌ది కీలక పాత్రగా పార్టీలో టాక్.
అయితే ఈ మధ్య కాలంలో వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడుతున్నారని, కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అసంతృప్తుల జాబితాలో చేరిపోయారని చర్చ సాగింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు వినిపించాయి. కొందరు కీలక నేతలతోపాటు వివేక్ పేరుపైనా పెద్ద చర్చ సాగింది. తర్వాత ఏమైందో ఏమో.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆదిలాబాద్‌లో నిర్వహించిన జనగర్జన సభలో వివేక్ వెంకటస్వామి కనిపించారు.
ఇతర బీజేపీ నేతల పేర్లను అమిత్ షా ప్రస్తావించినా.. ఇలా ఎవరిని కుర్చీలో నుంచి పైకి లేవాలని కోరలేదు. కానీ.. వివేక్ వెంకటస్వామి పేరు దగ్గరకు రాగానే.. షా ఎందుకు ఇలా చేశారు? మాజీ ఎంపీలోని అసంతృప్తిని ఢిల్లీ పార్టీ పెద్దలు గుర్తించారా? ఆ మేరకు బుజ్జగింపులు ఫలించాయా? వివేక్ వెంకటస్వామి బీజేపీతోనే ఉన్నారని చెప్పడానికి అమిత్ షా అలా చేశారా? బీజేపీలో వివేక్ వెంకటస్వామి ప్రాధాన్యం తగ్గలేదని సంకేతాలు పంపారా? ప్రస్తుతం కాషాయ శిబిరంలో ఇదే చర్చ. ఎంతైనా బీజేపీలో మోదీ, అమిత్ షా నజర్‌లో నేతలు ఉంటే.. ఆ లెక్కే వేరనే టాక్ పార్టీలో ఉంది. వివేక్ వెంకటస్వామి ఆ జాబితాలో చేరారనేది తాజా చర్చ .