దసరా పండుగకు, పాలపిట్టకు మధ్య ఎంతో ప్రత్యేకత ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. దాని వెనుక కారణాలు ఉన్నాయి. పూర్వం పాండవులు అరణ్యవాసం ముగించుకుని తిరిగి వస్తుండగా వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. ఆ తర్వాత కురుక్షేత్రంలో విజయం సాధించారు. దసరా రోజున పాలపిట్టను చూసినందుకు విజయం సిద్ధించిందనే కారణంతో అది ఆచారంగా మారిందని చెబుతుంటారు. అలా పండుగ రోజు మగవాళ్లు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అది సంప్రదాయంగా కొనసాగుతోంది. అలాగే రావణుడితో యుద్ధానికి వెళ్లేముందు శ్రీరాముడు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని చెబుతుంటారు. అందుకే దసరా రోజున పాలపిట్టని చూస్తే శుభమని చెబుతుంటారు.