విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి గెలిచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80), రింకూ సింగ్ (22*) అదరగొట్టారు. అయితే రింకూ చివరి బంతిని సిక్సర్‌గా బాదినా.. ఆ రన్స్‌ను అంపైర్లు కౌంట్ చేయలేదు. ఎందుకంటే.. ఆఖరి బంతికి భారత్ విజయం సాధించాలంటే ఒక్క పరుగు చేయాలి. అబాట్ వేసిన ఆ బంతిని రింకూ స్టాండ్స్‌కు తరలించాడు. కానీ అది నోబాల్. దీంతో టీమిండియా నోబాల్‌తో గెలిచినట్లుగా అంపైర్లు నిర్ణయించారు. అందుకే రింకూ సాధించిన సిక్సర్ కౌంట్ చేయలేదు. ఆస్ట్రేలియాతో భారత్ అయిదు టీ20ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరువనంతపురం వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది.