Nipah virus- ఈ ‘నిఫా’ యమ డేంజర్‌.. మరోసారి లాక్‌డౌనా?

కేరళ (Kerala)ను నిఫా వైరస్‌ (Nipah virus) భయపెడుతోంది. ఈ వైరస్‌ ఇప్పటికీ ఆరుగురికి సోకగా వారిలో ఇద్దరు మరణించారు. వైరస్‌ వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇది ఎంతో ప్రమాదకరం. మరణాల రేటు ఏకంగా 40-70% ఉంటుంది. గతంలో ప్రజల్ని వణికించిన కరోనా మరణాల రేటు 2-3% మాత్రమే. అందుకే నిఫాను ఆదిలోనే అరికట్టాలని ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వైరస్‌ సోకితే మరో భారీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైరస్‌ వ్యాప్తి కొజికొడ్‌ జిల్లాలో కనిపిస్తున్నందున, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు 24 వరకు సెలవులను ప్రకటించారు. అంతేగాక నిఫా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండే అవకాశముందని, అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎమ్మార్‌ హెచ్చరించాయి.

రాయిటర్స్ సంస్థ మే నెలలోనే నిఫా వైరస్ వ్యాప్తిపై పరిశోధనల వివరాలను ప్రచురించింది. ఉష్ణమండల రాష్ట్రమైన కేరళలో పట్టణీకరణతోపాటు ఇష్టానుసారంగా చెట్లను నరికివేయడం వంటి పరిస్థితులు నిఫా వైరస్ లాంటి వైరస్‌లు వ్యాపించడానికి అనువుగా మారాయని తెలిపింది. అటవీ ప్రాంతం తగ్గిపోవడం వలన జంతువులు ఆవాసాలను కోల్పోయి మానవులకు మరింత దగ్గరగా జీవిస్తున్నాయని, దీంతో వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు.

కాగా, కేరళలో నిఫా వైరస్‌ను గుర్తించడం ఇది నాలుగో సారి. గతంలో 2018, 2021 సంవత్సరాల్లో కొజికొడ్‌లో, 2019లో ఎర్నాకుళంలో ఈ వైరస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 2018లో కేరళలో నిఫా వైరస్‌ కారణంగా 21 మంది మరణించారు. అయితే 1999లో మలేషియాలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్‌కు ప్రత్యేకమైన మందులు లేవు. ఇది గబ్బిలాలు, జంతువుల నుంచి వ్యాపిస్తుంది. మనుషల నుండి మనుషులకు కూడా సంక్రమిస్తుంది. నిఫా వైరస్‌ వల్ల శ్వాసక్రియలో, మెదడులో ఇబ్బందులు తలెత్తుతాయి. వైరస్‌ సోకిన తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గు, శ్వాస ఆడకపోవటం, ప్రవర్తనలో తేడా, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం