చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ పేరును యథాతథంగా బెదురులంక సినిమాలో వాడేశాడు హీరో కార్తికేయ. సినిమాలో అతడి క్యారెక్టర్ పేరు ఇదే. ఇంతకీ బెదురులంకలో చిరంజీవి అసలు పేరును ఎందుకు వాడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు కార్తికేయ. “బెదురులంక సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సన్నివేశం దగ్గర ‘శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు’ అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనుకుంటున్నాం. సెట్‌లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో ఆ షాట్‌లో అలా చెప్పాం.” అంటూ వివరణ ఇచ్చాడు కార్తికేయ. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన పేరును తన సినిమాలో వాడుకోవడాన్ని అదృష్టంగా భావిస్తానని అన్నాడు.
ఇక బెదురులంక సినిమాకు, తన కెరీర్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్-100కు మధ్య ఉన్న చిన్న సెంటిమెంట్ ను కూడా బయటపెట్టాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు శివ. అది గోదావరి నేపథ్యంలో సాగిన కథ. బెదురులంకలోనూ హీరో పేరు శివ, ఇదీ గోదావరి నేపథ్యంలో తీసిన సినిమానే. ఇది యాదృచ్ఛికంగా జరిగిందంటున్నాడు కార్తికేయ. క్యారెక్టర్ పేరు శివ అని చెప్పినప్పుడు, ఆర్ఎక్స్100 బ్యాక్ స్టోరీని దర్శకుడికి చెప్పలేదని, షూటింగ్ సగం పూర్తయిన తర్వాత ఈ సెంటిమెంట్ గురించి చెప్పానని అంటున్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది బెదురులంక సినిమా. డీజే టిల్లూ బ్యూటీ నేహాశెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది.