వెస్టిండీస్ జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా (Team India) మరో ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో (INDvWI) పరాజయంపాలై 0-2తో సిరీస్‌లో వెనుకంజలో నిలిచింది. సిరీస్ సాధించాలంటే చివరి మూడు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (51) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆరభంలోనే షాక్ తగిలింది. హార్దిక్ తొలి ఓవర్‌లోనే బ్రాండన్ కింగ్ (0), చార్లెస్ (2)ను బోల్తాకొట్టించాడు. కాసేపటికే మేయర్స్ (15) కూడా వెనుదిరిగాడు. కానీ పూరన్ (67) ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో విండీస్ 61 పరుగులు చేసింది. అతడికి తోడుగా పావెల్ (21), హెట్‌మెయిర్ (22) కూడా రాణించడంతో ఆతిథ్యజట్టు గెలుపు దిశగా సాగింది. కానీ భారత బౌలర్లు పుంజుకుని 13 బంతుల వ్యవధిలో మూడు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కానీ హొసెన్ (16*), అల్జారి జోసెఫ్ (10*) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు, చాహల్ రెండు, ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో తిలక వర్మ ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ మరోసారి నిరాశపరిచారు. సిక్సర్ బాది దూకుడుగా ఉన్న శుభమన్ గిల్ (7) తర్వాత బంతికే వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (1) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. ఇషాన్ కిషాన్ (27)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే మరోసారి స్వల్ప వ్యవధిలోనే ఇషాన్, సంజు శాంసన్ (7) వెనుదిరిగారు. హార్దిక్ పాండ్య (24) కాసేపు క్రీజులో ఉన్నప్పటికీ భారీస్కోరు సాధించలేకపోయాడు. వెస్టిండీస్ బౌలర్లలో హొసేన్ , జోసెఫ్ ,షెఫార్డ్ తలో రెండు వికెట్లు తీశారు.