విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. సాయంత్రం నిజరూప అలంకారంలో భ్రమరాంబికా దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి, అమ్మవార్లను నంది వాహనంపై ఊరేగించనున్నారు. రాత్రి 8గంటలకు స్వామి, అమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.