స్వదేశంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్, టీవీ ప్రసారహక్కులను ‘వయాకామ్18’ దక్కించుకుంది. మీడియా హక్కులకు సంబంధించి బీసీసీఐ గురువారం ఈ-వేలం నిర్వహించింది. వేలంలో వయాకామ్18 ప్రసార హక్కులు దక్కించుకున్నాయని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు. గత అయిదేళ్లు బీసీసీఐతో భాగస్వామ్యం ఉన్న స్టార్ ఇండియా, డిస్నీ హాట్‌స్టార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్‌ను వ్యాప్తి చేయడంలో కృషి చేశారని అన్నారు. మరోవైపు వయాకామ్‌తో కలిసి భారత క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని పంచడానికి ప్రయత్నిస్తామని వివరించారు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు 67.8 కోట్ల చొప్పున వయాకామ్ చెల్లించనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 2028 మార్చి వరకు స్వదేశంలో టీమిండియా 88 మ్యాచ్‌లు ఆడనుంది. దీనిలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20 ఉంటాయి. గత ఒప్పందంలో స్టార్ ఇండియా 2018-23 కాలానికి 102 మ్యాచ్‌లకు రూ.6138 కోట్లు చెల్లించింది.
ఇప్పటికే ‘జియో సినిమా’ ఐపీఎల్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ డిజిటల్ హక్కులను పొందిన సంగతి తెలిసిందే. వయాకామ్-18, జియో సినిమా రెండూ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ చెందిన సంస్థలు. టీవీ ప్రసారాలు స్పోర్ట్స్ 18లోనూ, జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.