ఆసియాకప్ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే సాగుతున్నాయి. కానీ లంక వేదికగా జరిగే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అతిథిగా వస్తున్నాడు. దీంతో నిన్న జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షార్పణం అయింది. అయితే సోమవారం నేపాల్‌తో పల్లెకెలె వేదికగానే టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 80 శాతం వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
అయితే వర్షం కారణంగా రేపు మ్యాచ్ రద్దయితే టీమిండియాకు ఎలాంటి నష్టం ఉండదు. సూపర్-4కు నేరుగా అర్హత సాధిస్తుంది. కానీ, నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే పాక్ మ్యాచ్ రద్దుతో భారత్ ఒక పాయింట్ సాధించింది. రేపటి మ్యాచ్ కూడా వర్షార్పణం అయితే మరో పాయింట్ సాధిస్తుంది. దీంతో రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై భారీ విజయం సాధించిన పాక్ 3 పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఒకవేళ రేపటి ఆటకు వరుణుడు రాకపోతే భారీ విజయం సాధించి పాక్ రన్‌రేట్‌ను అధిగమిస్తేనే టీమిండియా మొదటిస్థానానికి చేరుతుంది.