ఎస్సై మెయిన్స్ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు తెలంగాణా స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మంగళవారం రాత్రి మెయిల్స్ వచ్చాయి. ”సంబంధించిన పోస్టులకు ఎంపిక అయితే మీరు ఉద్యోగం చేసేందుకు ఆసక్తితో ఉన్నారా? అవును అయితే ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బదులు ఇవ్వండి” అని మెయిల్ వచ్చింది. గతేడాది ఎస్సై నోటిఫికేషన్ విడుదలవ్వగా, ఏప్రిల్‌లో తుది పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మెయిల్.. మెరిట్ అభ్యర్థుల్లో 1:2 లేదా 1:3కు వచ్చిందా? సెలక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే వచ్చిందా? అనే విషయాలపై క్లారిటీ లేదు. రిక్రూట్మెంట్ బోర్డులో కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రెస్ నోట్ లేకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. అయితే నిర్ణీత గడువు తేదీలోపే మెయిల్ వచ్చిన అభ్యర్థులు.. లాగిన్ అయ్యి ఉద్యోగం చేసే నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని తెలపాలని నిపుణులు చెబుతున్నారు. గడువు ముగిసిన తర్వాత ఫలితాలు వెంటనే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.