తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ నుంచి 13,500 కోట్లతో చేపట్టనున్న పలు రకాల అభివృద్ధి పనులకు మోదీ వర్చువల్‌గా ఆదివారం శంకుస్థాపన చేశారు. వీటిలో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులున్నాయి.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని, హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో నిర్మించే అయిదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని, హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.