గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ తేదీలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. నవంబర్ 2,3 తేదీల్లో నాలుగు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2తో పాటు వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో సమావేశమయ్యారు. అనంతరం నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29,30న గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సన్నాహాలు కూడా జరిగాయి. కానీ వరుస పరీక్షల దృష్ట్యా రీషెడ్యూల్ చేశారు.