గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దాన్ని అమలు చేయడం వల్ల వచ్చే ఇబ్బందేమిటని, గతంలో బయోమెట్రిక్ లేకుండా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని పేర్కొంది. ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉందని, నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందని తెలిపింది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయని వ్యాఖ్యానించింది.