ఖలిస్థానీ అంశంపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది జూన్‌లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. నిజ్జర్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతడి తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. అయితే నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సోమవారం పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది.
ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించి గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ నేడు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఉదయం ఆయన దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో గల విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోని కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ కెనడా హైకమిషనర్‌కు తెలిపింది. అయిదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
అయితే ఈ విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో మనకి అమెరికా అండగా నిలిచింది. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని స్పందించింది. అయితే కెనడా భాగస్వామ్య పక్షాలను నిత్యం సంప్రదిస్తూనే ఉన్నామని, కెనడా దర్యాప్తును కొనసాగించడం, బాధ్యులకు శిక్ష పడటం ఇక్కడ కీలకమని తెలిపింది.