తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్‌గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన స్వామి తన బస్సును సిద్దిపేట-హైదరాబాద్‌కు ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నారు. దాని డ్రైవర్ ఆదివారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం వద్ద పార్కింగ్ చేసి తాళం వేయకుండానే వెళ్లిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు బస్సును దొంగిలించి వేములవాడకు తీసుకెళ్లాడు. సోమవారం ఉదయం పలువురు ప్రయాణికులను సిద్దిపేటకు తీసుకెళ్తానని ఎక్కించుకున్నాడు. వారికి టికెట్ తర్వాత ఇస్తానని డబ్బులు తీసుకున్నాడు. ఆర్టీసీ బస్సు కావడంతో ఎవరూ అనుమానించలేదు.
ఈ క్రమంలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి- నేరెళ్ల మార్గంలో బస్సు ఆగిపోయింది. ప్రయాణికులకు డీజిల్ అయిపోయింది, తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వారంతా ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు బస్సు రోడ్డు పక్కన ఉండటాన్ని గమనించి తమ కంట్రోలర్‌కు ఫోన్ చేశారు.అనంతరం బస్సును స్వాధీనం చేసుకున్నారు. చోరీ ఘటనపై సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి పట్టుకున్నారు.