రానున్న తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్‌లో రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతే ఎలక్షన్ జరగవచ్చని అన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తే వెంటనే ఎన్నికలు జరుగుతాయని, కానీ ఆలోపు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు వచ్చినా, అప్పటివరకు తమ ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ప్రగతి భవన్‌లో విలేకరులతో జరిగిన సమాశంలో ఆయన మాట్లాడారు.
అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మరింత సానుకూలత వ్యక్తమవుతోందని, 90కిపైగా స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే వివరిస్తున్నారని అన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉందని, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతిపక్షాలు అయోమయంలో ఉన్నాయని, వారి తాపత్రయమంతా రెండో స్థానం కోసమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోయిందన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై గానీ, ఇతర నేతలపై గానీ ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు.