INDvWI: సిరీస్‌ పోయింది.. సమాధానానికి సమయం లేదు!!

వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను (INDvWI) 2-3తో కోల్పోయింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి విమర్శలు పాలైన హార్దిక్‌ సేన.. తర్వాత మ్యాచ్‌ల్లో పుంజుకుని సత్తాచాటింది. 2-2తో సిరీస్‌ను సమం చేసింది. కానీ ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ‘టాస్‌ ప్రయోగం’ కొంపముంచింది. ఛేదనకు అనుకూలంగా ఉంటుందని తెలిసినా.. సవాళ్లు అంటే ఇష్టమని కెప్టెన్ హార్దిక్ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. మొత్తంగా ఏడేళ్ల తర్వాత టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో విండీస్‌ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

అయితే టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రకారం సిరీస్‌ కోల్పోయినందుకు అభిమానులు బాధ పడాల్సిన అవసరం లేదు. సిరీస్‌లు మాకు ముఖ్యం కాదు, ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి పెద్ద ట్రోఫీలపైనే మా దృష్టి అని ద్రవిడ్‌ గతంలో క్లారిటీగా చెప్పాడు. కానీ వెస్టిండీస్‌ పర్యటనలో భారత జట్టుకు సానుకూలతలు ఏంటి? ప్రయోగాల్లో సక్సెస్‌ ఏంటి?

యువ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్‌, తిలక్‌ వర్మ అని సమాధానం చెప్పొచ్చు. జైశ్వాల్‌ ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌, తెలుగు కుర్రాడు తిలక్‌ దూకుడు జట్టుకు కలిసొచ్చాయని భావించవచ్చు. కానీ వారిద్దరు రాణించింది టీ20ల్లో. వన్డేల్లో అసలు వారికి అవకాశమే ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియా, ప్రపంచకప్‌ వన్డే ఫార్మాట్‌. ఇలాంటి స్థితిలో టీమిండియా ప్రయోగాల్లో లాభమేంటో తెలియని పరిస్థితి.

అభిమానుల్లో కలవరపెడుతున్న మరో అంశం.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించని వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోల్పోవడం. అయితే పొట్టి ఫార్మాట్‌లో కరీబియన్‌ ఆటగాళ్లు ఎంతో ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ బలమైన భారత జట్టు సిరీస్‌ను కోల్పోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్లో ఓడి ఇంటికి చేరింది. సూపర్‌ ఫామ్‌లో రోహిత్‌, కోహ్లితో పాటు ఫినిషర్‌ ధోనీ అప్పటి జట్టులో ఉన్నప్పటికీ ఫైనల్‌కు చేరలేకపోయాం. దానికి ప్రధాన కారణం నాలుగో స్థానంలో సరైన ఆటగాడిని భర్తీ చేయలేకపోవడమే. అప్పటి వరకు అంబటి రాయుడు 4వ స్థానంలో ఉంటాడని అందరూ భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పక్కనపెట్టడం చర్చనీయాంశంగా మారింది. తర్వాత సెలక్టర్ల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

మరోసారి ఇప్పుడు అదే ప్రశ్న భారత జట్టును వేదిస్తోంది. దాని కోసం ప్రయోగాలు మొదలుపెట్టారు. వెస్టిండీస్‌ పర్యటన కూడా అందులో ఒక భాగమే. కానీ వెస్టిండీస్‌ పర్యటనలో నాలుగో స్థానానికి జవాబు ఇంకా దొరకలేదు. వన్డే సిరీస్‌లో సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఎవరూ చేయలేదు. మిస్టర్‌ 360 సూర్య ఘోరంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో 78 పరుగులే చేశాడు. అతడు వన్డే ఫార్మాట్ లో మరోసారి తేలిపోయాడు. మరోవైపు వికెట్‌కీపర్‌ సంజు శాంసన్‌ ఒక మ్యాచ్‌లో మాత్రమే హాఫ్‌ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. విండీస్ జరిగిన వన్డేల్లో ఇద్దరు వికెట్ కీపర్లను టీమిండియా ప్రయోగించింది. ఇషాన్ కిషాన్, శాంసన్. కానీ ఇషాన్ ఓపెనర్ గా బరిలోకి దిగితే.. శాంసన్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చాడు.

ఇక కెప్టెన్‌ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యూహాలు ఎవరికీ అర్థం కానీ పరిస్థితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక క్రమం ఉండదు. ఏ ఆటగాడు ఏ స్థానంలో వస్తాడో క్లారిటీ ఉండదు. తొలి మూడు స్థానాలే కాస్త ఫిక్సడ్‌గా ఉంటాయి. ఇక తుదిజట్టు స్థిరంగా ఎప్పుడూ ఉండదు. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఫలితంగా బ్యాటింగ్‌లో మళ్లీ సీనియర్లు రోహిత్, కోహ్లి మీదే జట్టు ఆధారపడే పరిస్థితి. నాలుగు, అయిదు స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్ అని తొలుత భావించినా.. గాయాలు వారిని జట్టుకు దూరం చేశాయి. వన్డే ప్రపంచకప్‌కు వారు పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించడం కష్టమే.

ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఎలా సన్నద్ధమవుతోందనేదే అందరి ప్రశ్న. మెరుగైన ఆటగాళ్లు ఉన్నా తుదిజట్టు ఎంపికలో, బ్యాటింగ్‌ ఆర్డర్ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ కు ఎప్పుడూ సవాలే. అయితే వాటి కోసం ప్రయోగాలు చేయడానికి సమయం కూడా ఎక్కువగా లేదు. ఆసియా కప్‌ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ మాత్రమే భారత్ వన్డే ఫార్మాట్ ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు తుదిజట్టు ఎంపికకు చివరి అవకాశం ఆసీస్ సిరీసే. ఆ సమయం వరకు అయినా బలమైన తుదిజట్టును సిద్ధం చేయాలని, కప్‌ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం