సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆటను చూడాలనుకునే క్రికెట్ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని, జట్టుతో కలిసి దిల్లీకి కూడా వెళ్లలేదని బీసీసీఐ అధికారికంగా సోమవారం ప్రకటించింది.
”టీమిండియా బ్యాటర్ గిల్ జట్టుతో కలిసి దిల్లీకి వెళ్లలేదు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌కు దూరమైన ఈ ఓపెనర్ అక్టోబర్ 11న జరిగే అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నాడు. మెడికల్ బృందం పర్యవేక్షణలో చెన్నైలోనే ఉంటాడు” అని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్ కిషాన్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే కిషాన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. అతడితో పాటు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ కూడా డకౌటవ్వడంతో 2 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కలిసి జట్టును గెలిపించారు. ప్రపంచకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్ దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.