సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కాగా, రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.
వాదనలు అనంతరం .. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర్వ ఉత్తర్వులు ఇచ్చింది. అభ్యంతరకర వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదని, ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష వేయడానికి కారణమేంటన్నది దిగువ కోర్టు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది.
కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.