ద్విమూర్తులుగా కొలువైన ‘ద్వారకా తిరుమల’ విశేషాలు..

వేంకటాద్రి సమం స్థానం బహ్మాండే నాస్తి కించనం
వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి
అనే మహత్తర విషయం అందరికీ తెలిసిందే. అటువంటి మహిమాన్వితమైన మరో క్షేత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన చిన తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల క్షేత్రం

ద్వారకాతిరుమల క్షేత్ర చరిత్ర

ఈ క్షేత్రం ప్రస్తుంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. విజయవాడ నగరానికి 98 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కిలోమీటర్ల దూరంలోను, ఏలూరు నుంచి 42 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఈ క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రంగా చెప్పబడుతుంది. పవిత్ర గౌతమి – కృష్ణవేణి పుణ్యనదుల మధ్య శేషాకారంలో గల కొండపై నెలకొన్న పుణ్యక్షేత్రం ఇది.

ఒకే విమాన శిఖరము కింద రెండు విగ్రహాలు ఉండడం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగం మాత్రమే కనిపిచే అర్ద విగ్రహం.
ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతి ఏటా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడట. ఆయనకు వృద్ధాప్యం సమీపించడంతో అంత దూరం వెళ్లే ఓపిక లేకపోవడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని మరో కథనం. ఆ ద్వారకుని పేరుతోనే ఈ క్షేత్రం కాలక్రమంలో ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి పొందినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. ఐతే చెట్టుకొట్టి కట్టెలు అమ్ముకోవడాన్ని దారుకం అని అంటారు. దారుకం వృత్తిగా కలవారు ఇక్కడ ఎక్కువగా ఉండడంతోను, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలలోను ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి పొందిందని భక్తుల నమ్మకం.

స్వయంభువుగా ప్రత్యక్షమైన శ్రీవేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారకా ముని పేరు మీద ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమలగా పేరు సార్ధకమైంది. ద్వారకామహర్షి తపోఫలితంగా ఉద్భవించిన ఈ క్షేత్రాన్ని ద్వారకాతిరుమలగా పిలుస్తున్నారు. ఇక్కడ స్వయంభువుగా కొలువు తీరిన చినవేంకటేశ్వరస్వామి పుట్టలో వెలిసారు. స్వామివారి పాదుకలు పుట్టలో ఉండటంతో శ్రీవారికి ఇక్కడ పాదపూజ నిర్వహించరు.

దీంతో పెదతిరుపతి నుంచి పాదపూజ కోసం శ్రీనివాసుని ఇక్కడకు తీసుకొచ్చి, శ్రీవైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఇక్కడ ప్రతిష్టించారు. దీంతో ఒకే అంతరాలయంలో స్వామి వారు ద్విమూర్తులుగా కొలువై ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇద్దరు మూర్తులూ ఇక్కడే ఉండటం వల్ల ఏటా ఈ క్షేత్రంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వయంభువుగా వెలసిన చినవెంకన్నకు వైశాఖ మాసంలోను, ప్రతిష్ఠ స్వామి అయిన పెద వెంకన్నకు ఆశ్వయుజ మాసంలోను తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఈ క్షేత్ర స్వరూపం శేషాకృతితో ఉన్న ఆదిశేషుని అవతారమని, శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుని పేరుతో ఇక్కడ వెలిశారని, మానవులను తరింప జేసేందుకు కృతాయుగంలోనే ఈ కొండపై వెలిసినట్లుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది.

స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో ఈ క్షేత్రాన్ని శ్రీరాముని పితామహుడైన అజమహారాజు, తండ్రియైన దశరధుడు, శ్రీరాముడు వారివారి కాలాల్లో ఈ స్వామిని సేవించుకున్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

స్వామివారి పాదాలు

గుడి ప్రాంగణంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలి మెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. స్వామి పాదాలకు నమస్కరించిన అనంతరం భక్తులు పైకి ఉపక్రమిస్తారు.

12 మంది ఆళ్వారుల ప్రతిమలు

ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పై భాగంలో సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహారీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల విగ్రహాలున్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడస్వాముల చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.

గాలి గోపురాలు

ప్రధానాలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదన శాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. దక్షిణ దిక్కున గల గాలిపోపురం ఐదు అంతస్తులతో ఉంది. గోపురాల నిర్మాణంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని మనం చూడవచ్చు. ప్రాకారం చుట్టూ 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్టింపబడి ఉన్నాయి.

పుష్కరిణి

ద్వారకాతిరుమల క్షేత్రం పశ్చిమంలో స్వామివారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్థమని పిలుస్తారు. ఇక్కడ చక్ర తీర్థము, రామ తీర్థము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్లపైన సుదర్శన చక్రం ఆకారం ఉండడం వల్ల ఈ పేరు వచ్చినట్లు పేర్కొంటారు.

వివిధ మంటపాలు

గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరు వేరు చోట్ల ఉన్నాయి. ఇంకా కొండపై వాయువ్య దిశలో భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. మొత్తం కొండ ఆదిశేషుని ఆకారంలో ఉందనీ, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువుదీరినట్లు భక్తులు విశ్వసిస్తారు.

పెద తిరుపతి వెంకన్న ఇక్కడ ఉండటంతో అక్కడి మ్రొక్కులను చిన్నతిరుపతిలో తీర్చుకునే సంప్రదాయం కూడా ఉంది. కానీ ఇక్కడి మ్రొక్కులు మాత్రం పెద్దతిరుపతిలో తీర్చుకోకూడదని పండితులు చెబుతారు. శ్రీ స్వామివారి సన్నిధికి కుడివైపు అలివేలు మంగమ్మ, ఆండాళ్ అమ్మవార్ల ఆలయాలు విరాజిల్లుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ ఆళ్వార్ గోపురాలు, ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలున్నాయి.
భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు వీలుగా ఆలయానికి పడమరవైపు కల్యాణకట్ట ఉంది. అలాగే కొండపైన, దిగువన పలు సత్రాలు, కల్యాణ మండపాలు, కాటేజీలు కూడా ఉన్నాయి. ఈ ద్వారకా తిరుమల క్షేత్రం ఎంతో ప్రఖ్యాతి వహించింది.

ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా ఏలూరు కాని, తాడేపల్లి గూడెం గాని చేరుకుంటే అక్కడి నుంచి ద్వారాకా తిరుమలకు బస్సు సౌకర్యం ఉంది.


Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం