Special Session of Parliament-జమిలి ఎన్నికలా? జమ్ము ఎన్నికలా?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను (special session of parliament) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ స్పెషల్‌ సెషన్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారనేదీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వేర్వేరు వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికి పార్లమెంటును సమావేశపరుస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జమ్ముకశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించడానికే సమావేశాలని భావిస్తున్నారు.

మరోవైపు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ (One nation, one election) పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ మరికొందరు వాదిస్తున్నారు. అయితే తాజాగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికల’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో జమిలీ ఎన్నికల ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను మోదీ సర్కారు గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు దీన్ని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టిందని భావిస్తున్నారు.

అజెండాలో ‘ముఖ్యమైన’ అంశాలు – ప్రహ్లాద్‌ జోషి
ప్రత్యేక సమావేశాల గురించి పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం స్పందించారు. అజెండాలో ముఖ్యమైన అంశాలున్నాయని, వాటిని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అయితే, ఆ ముఖ్యమైన విషయాలు ఏంటనేది మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ”పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. త్వరలోనే అజెండాను అందరికీ తెలియజేస్తాం. ఇందుకు చాలా సమయం ఉంది” అని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం