ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. వాటిలో వినూత్న స్టిల్స్‌తో వచ్చే వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఓ జంట పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేశారు. అయితే వారిద్దరూ పోలీసు అధికారులే. కానీ దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. పోలీస్ యూనిఫామ్‌ను ఇలా ఉపయోగించడం బాగోలేదని కొందరు వాదిస్తుంటే.. అలా చేస్తే తప్పేముందని మరికొందరు మద్దతు ఇస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారని, అయితే పోలీసు దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని తప్పుబట్టడం లేదని తెలిపారు. కానీ ముందే అనుమతి కోరాల్సిందని అన్నారు. అయితే వరుడు ఏఆర్ ఎస్సైకాగా, వధువు సివిల్ ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.