తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాల కూటమి ఇటీవల ముంబయిలో సమావేశం నిర్వహించిందని, దురహంకారి కూటమిని నడిపేందుకు వ్యూహాలు రచిస్తుందని మోదీ అన్నారు. దేశ సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహమని విమర్శించారు. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై దాడిచేయాలని విపక్ష కూటమి నిర్ణయించుకుందని పేర్కొన్నారు. తిలక్, స్వామి వివేకానంద వంటివారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటుందని మండిపడ్డారు.
”సనాతన ధర్మం ఓ వ్యాధి లాంటిది. సామాజిక సమానత్వానికి అది విరుద్ధం. ప్రజలను కులాల పేరిట విభజించింది. దీన్ని నిర్మూలించాలి” అంటూ ఉదయనిధి స్టాలిన్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భాజపా సహా, హిందూ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ విషయంపై స్పందించారు. సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారని, దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు.