బ్యాట్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకునేలా, ఓటింగు శాతం పెంచేందుకు ఈసీతో కలిసి సచిన్ సంయుక్తంగా కృషి చేయనున్నాడు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగుపై నిర్లక్ష్యం చూపుతున్నందున వారిలో అవగాహన కల్పించేందుకు కృషి చేయనున్నాడు.
సచిన్ ప్రచారంతో రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని ఈసీ భావిస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎం.ఎస్.ధోనీ, అమీర్‌ఖాన్, మేరీకోమ్ నేషనల్ ఐకాన్స్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా, దేశంలో ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని ఈసీ ఇటీవల ప్రకటించింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలప్పుడు నమోదైన ఓటర్లతో (17.32 కోట్లు) పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య అయిదున్నర రెట్లు పెరిగింది.