జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడానికి ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ విఫలమైంది. ల్యాండర్ కుప్పకూలిపోయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటించింది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత రష్యా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతంలో సోయుజ్-2 ఫ్రిగట్ రాకెట్ ద్వారా ఈ నెల 10వ తేదీన రష్యా ప్రయోగం చేపట్టింది. 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్నిసిద్ధం చేసింది.
అయితే లూనా-25లో సాంకేతిక సమస్య తలెత్తాయని రోస్‌కాస్మోస్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటోమెటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు తెలిపింది. అనంతరం కొన్ని గంటల్లోనే ల్యాండర్ కుప్పకూలినట్లు వెల్లడించింది. ”జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్ అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించింది. అనంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది” అని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ప్రకటించింది.