ఐపీఎల్-2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ ప్లాన్స్ మొదలుపెట్టాయి. నవంబర్ 26లోపు రిటైన్ ఆటగాళ్ల వివరాలను ప్రతి జట్టు సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 19న వేలం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్లను బదిలీ చేసుకున్నాయి. లక్నో తరఫున ఆడిన పేసర్ ఆవేష్ ఖాన్ రాజస్థాన్ జట్టులో.. ఇక ఓపెనర్ పడికల్ రాజస్థాన్ నుంచి లక్నో గూటికి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. వేలంలో ఆవేష్ ఖాన్‌ను లక్నో రూ.10 కోట్లకు, పడికల్‌ను రాజస్థాన్ రూ.7.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్‌లో లక్నో స్లో పిచ్‌లపై ఆవేష్ ఖాన్ ఆశించినరీతిలో రాణించలేదు. మరోవైపు పడికల్ 23 ఏవరేజ్‌తోనే పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో ఇరు జట్ల ఫ్రాంచైజీలు వారి బదిలీపై నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల విండీస్ ఆల్‌రౌండర్ షెఫర్డ్‌ను లక్నో.. ముంబయికు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.