రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచే ఈ సినిమా ప్రచారానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. అదే రోజు రామ్ మేకోవర్ ను పరిచయం చేశారు. దానికి సంబంధించి వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సంజయ్ దత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అతడి పాత్ర పేరును కూడా బయటపెట్టారు. ఇలా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ తో పాటు ప్రమోషన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడిదే స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు.
ముంబయిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ లో రామ్, సంజయ్ దత్ మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. రామ్ తో పాటు ఇతర నటీనటుల మధ్య మరికొంత టాకీ పూర్తిచేశారు. అలా ఫస్ట్ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేశారు. అతి త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ కూడా మొదలవుతుంది. డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి హీరో ఎవరో తెలిసిపోయింది. విలన్ ఎవరో తెలిసిపోయింది. ఇక తేలాల్సింది హీరోయిన్ మాత్రమే. ఆమె పేరుతో పాటు ఫస్ట్ లుక్ ను ఒకే సారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బహుశా సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అయిన వెంటనే ఆ అప్ డేట్ కూడా ఇస్తారేమో.
ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న, మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ఇటు రామ్ పోతినేని, అటు పూరి జగన్నాధ్ ఇద్దరూ సక్సెస్ అందుకోలేకపోయారు. రామ్ వారియర్ రూపంలో ఫ్లాప్ ఇవ్వగా, లైగర్ రూపంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చాడు పూరి జగన్నాధ్. ఇప్పుడు ఇద్దరూ కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు.