RakshaBandhan- ఇక్కడ రాఖీ.. మిగిలిన రాష్ట్రాల్లో?

సోదర సోదరీమణుల పవిత్ర బాంధవ్యానికి ప్రతీక- రాఖీ పౌర్ణమి. ఉత్తర భారతదేశంలో విశేషంగా వ్యాప్తిలో ఉన్న ఈ వేడుక క్రమంగా దేశమంతటా విస్తరిల్లింది. అయితే ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అభివర్ణిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘పౌవతి పౌర్ణమి’ అంటారు. అరటి ఆకులో మంగళద్రవ్యాల్ని సోదరికి సోదరుడు సమర్పిస్తాడు. మహారాష్ట్రలో నారియల్‌ పౌర్ణమిగా అంటారు. సముద్ర జలాల్లోకి పూర్ణఫలమైన కొబ్బరికాయను వదిలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటారు. మధ్యప్రదేశ్‌లో కజరీ పౌర్ణమిగా, ఈశాన్య భారతంలో జనై పౌర్ణమిగా జరుపుకుంటారు. గుజరాత్‌లో పవిత్రోపనాతినిగా, బెంగాల్‌, ఒడిశాల్లో ఝులన్‌ పౌర్ణమిగా ఈ పండుగను పిలుస్తారు. స్వాతంత్య్రోద్యమ సందర్భంలో తిలక్‌.. స్వేచ్ఛాభారత్‌ రక్షాపర్వ్‌గా, ఠాగూర్‌.. జాతీయ సమైక్య వారధిగా పిలుపునిచ్చారు.

శ్రావణ పౌర్ణమినాడు ధరించే రక్షను ‘రాఖీ’ అంటారు. రాఖీ సూత్రానికి రక్షిక అని పేరు. పురాణాల ప్రకారం రక్షిక గురించి చాలా విశేషాలు ఉన్నాయి. సోదరుడి భద్రతకు, సోదరి సౌభాగ్యానికి ‘రక్షిక’ నేపథ్యం కావాలని, శ్రీకృష్ణుడికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తూ సుభద్ర వరం కోరుకుంది. అందుకు శ్రీకృష్ణుడు మహదానందంగా ఆమోదం తెలిపాడు. పాండవులకు విజయం లభించడానికి, కురుక్షేత్రంలో విజేతలు కావడానికి ధర్మరాజుతో సోదరులకు ‘సురక్ష’లను ధరింపజేశాడని మహాభారతం చెబుతోంది. అలాగే సోదరి శుభాకాంక్షలతో సోదరుడు సర్వదా వర్ధిల్లాలని, రక్షాబంధనం వారి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచాలని యముడి సోదరి యమున కోరుకుంది. దానికి తథాస్తు యముడు అన్నాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ పౌర్ణమినాడే జ్ఞానానంద స్వరూపుడైన హయగ్రీవుడు ఆవిర్భవించాడు. మహాలక్ష్మికి పరమేశ్వరుడు ధనాధిపత్యాన్ని, మహా సరస్వతికి విద్యాధిపత్యాన్ని అనుగ్రహించింది శ్రావణ పౌర్ణమినాడేనని పురాణాలు విశ్లేషించాయి. సంస్కృత భాషను సృజించి, బ్రహ్మకు సర్వేశ్వరుడు జ్ఞానభాండంగా అందించింది శ్రావణ పౌర్ణమి రోజేనని ‘శరభ సంహిత’ చెబుతుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం