తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు.. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా ఈ నెల 24న బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తెలంగాణ,ఆంధ్రపదేశ్‌కు మరో రెండు-మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ జంట జలాశయాల్లో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. హిమాయత్ సాగర్‌కు 1600 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్‌కు 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1785.65 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను శుక్రవారం ఎత్తివేసినప్పటికీ, ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గకపోవడంతో ఈ రోజు మరో రెండు గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,397.52 అడుగులుగా నమోదైంది. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,079.10 అడుగులకు చేరింది.
మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరిన ప్రవాహం, ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. 9.45 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సాయంత్రానికి వరద మరింతగా తగ్గనుంది. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉద్ధృతి తగ్గుతోంది. శుక్రవారం ఉదయం నీటి మట్టం 43 అడుగుల కంటే తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు విరమించారు.