తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది.
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. విద్య, ఉపాధి సహా వివిధ రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందని చెప్పారు. అయితే నియోజక వర్గానికి ఎంత మంది లబ్ధిదారులని ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.