భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ పురస్కారం దక్కింది. వారి పరిశోధనలతో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. పెర్రీ అమెరికా, ఫెరెన్స్ జర్మనీ, హ్యూలియర్ స్వీడన్ దేశానికి చెందినవారు. కాగా, సోమవారం వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ అవార్డు వరించింది. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.