అరంగేట్రం చేసి నెల రోజులు కూడా పూర్తికాలేదు. అంతలోనే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు మరో అవకాశం లభించింది. మాజీలు, అభిమానులు ఆశించినట్లుగానే ఈ 20 ఏళ్ల కుర్రాడు ఆసియాకప్‌కు ఎంపిక అయ్యాడు. పెద్ద టోర్నీ అయిన ఆసియాకప్‌తోనే వన్డే ఫార్మాట్‌ను ప్రారంభించనున్నాడు. అయితే తన ఎంపికపై తిలక్ వర్మ స్పందించాడు.
”భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాలనేది కల. నెల రోజుల క్రితమే టీ20 కెరీర్‌ను ఆరంభించాను. అంతలోనే వన్డే ఫార్మాట్‌లో అవకాశం లభించింది. ఆసియాకప్‌తోనే 50 ఓవర్ల ఫార్మాట్‌ను ప్రారంభించనుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆసియాకప్ కోసం సన్నద్ధమవుతున్నా. ఆ టోర్నీలో రాణిస్తాననే పూర్తి నమ్మకం ఉంది. గతంలో లిస్ట్-A క్రికెట్ ఆడిన అనుభవం ఉంది” అని తిలక్ అన్నాడు.
ఐపీఎల్ సమయంలో రోహిత్ అండగా నిలిచాడని తిలక్ తెలిపాడు. ”రోహిత్ శర్మ చాలా సపోర్ట్ చేశాడు. ఐపీఎల్ ఆడే ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఆ సమయంలో రోహిత్ వచ్చి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆటను ఆస్వాదించమని చెప్పాడు. నిర్భయంగా బ్యాటింగ్ చేయాలని అన్నాడు. ఏదైనా సమస్య అనిపిస్తే మాట్లాడటానికి ఏ సమయంంలోనైనా అందుబాటులో ఉంటానన్నాడు” అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
తిలక్ వర్మ ఎంపికపై టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ” తిలక్ సామర్థ్యం, సత్తాను వెస్టిండీస్ టూర్‌లో చూశాం. అతడి ఆట భరోసా ఇచ్చేలా ఉంటుంది. ఎడమచేతి వాటం, అతడి దూకుడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి” అని అగార్కర్ తెలిపాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 7 టీ20లు ఆడిన అతడు 34.8 సగటుతో 174 పరుగులు చేశాడు.