లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు 13 సంవత్సరాలుగా, సౌత్ లో ఓ ఊపు ఊపిన ఈ హీరోయిన్, ఇప్పుడు తన మొదటి హిందీ చిత్రంతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. షారుఖ్ ఖాన్ తో కలిసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. అలా బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్ కు పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. నయనతార టాలీవుడ్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు, ఆమె కొత్త ఆఫర్‌లను తిరస్కరించినట్లు కనిపిస్తోంది.
ఇటీవల, టాలీవుడ్ నిర్మాతలు కొంతమంది నయనతారను కలిసే ప్రయత్నం చేశారు. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు. అయితే నయనతారకు తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తి లేదని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె తెలుగు చిత్రనిర్మాతల నుండి స్క్రిప్ట్‌లు వినడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. జవాన్‌తో, ఆమెకు పాన్ ఇండియా వైడ్‌లో చాలా పేరు వచ్చింది, ఇప్పుడు నయనతార కాల్షీట్లకు డిమాండ్ పెరిగింది.
నిజానికి టాలీవుడ్ అంటే నయనతారకు మొదట్నుంచి చిన్నచూపే. కోలీవుడ్ లో కాల్షీట్లు కేటాయించగా, ఏమైనా మిగిలితే తెలుగు సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. ఎప్పుడైతే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిందో, ఇక ఆమె తన కాల్షీట్లను బాలీవుడ్ ప్రాజెక్టులకు మరల్చడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆమె మరో హిందీ సినిమాకు కాల్షీట్ ఇచ్చిందంటే, టాలీవుడ్ కు దూరమైనట్టే.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, జాఫర్ సాదిక్, సన్యా మల్హోత్రా, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ చిత్రం మొదటి వారాంతంలో 4 రోజుల్లో 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ సక్సెస్ తో మరిన్ని హిందీ సినిమాలు చేయాలని అనుకుంటోంది నయనతార.