చిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, వారే కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. అత్యాచారం చేశారనే అనుమానం కూడా ఉందన్నారు. ”ఈ నెల17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన మా కుమారై తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత శవమై కనిపించింది. ముగ్గురు యువకులు ప్రేమపేరుతో వేధించేవారు. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారు. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారు” అని వారు చెప్పారు. అయితే వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి ఫోన్లలో కాల్‌డేటాను పరిశీలించామని చెప్పారు. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.