ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమను దేశంలో ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలో ఎన్నో కీలక భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ (1972-79)కు జనరల్ డైరక్టర్‌గా, ఆ తర్వాత భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు (1980) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు (1982 -1988) డైరక్టర్ జనరల్‌గా , ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్‌కు (1984-90) అధ్యక్షుడిగా సేవలు అందించారు.
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జన్యు శాస్త్రంలో Ph.D పూర్తిచేశారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ స్వామినాథన్‌ను ప్రభావితం చేశారు. స్వామినాథన్‌కు పద్మశ్రీ (1967), పద్మభూషణ్ (1972), పద్మ విభూషణ్ (1989), రామన్ మెగసెసే (1971) అవార్డులు దక్కాయి.