సోషల్ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్’ టైమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్ సెల్ఫీ తీయగా ధోనీ, బుమ్రా, పంత్, మయాంక్ అగర్వాల్ ఫొటోలో ఉన్నారు. అయితే ఫొటో అంతా ఓకే కానీ, పంత్ భుజంపై ఉన్న చేయి ఎవరిదనేది అంతుచిక్కని ప్రశ్న. దీనిపై ఎన్నో చర్చలు, కామెంట్లు, థియరీలు కూడా వచ్చాయి. అయినా క్లారిటీ రాలేదు. ఫైనల్‌గా దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై మయాంక్ స్పందించాడు. పంత్ భుజంపై ఉన్న చేయి ఎవరిదో కాదు తనదేనని ఆ మిస్టరీ గుట్టు విప్పాడు.
”ఎన్నో ఏళ్ల పరిశోధనలు, చర్చలు, సిద్ధాంతాల తర్వాత దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పంత్ భుజం మీద ఉన్నది నా చేయి. మీరు ఇప్పటివరకు వేసిన థియరీల్లో నిజం లేదు” అని ఫొటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశాడు. కాగా, ఫొటో మిస్టరీ వీడినా నెటిజన్లు సంతృప్తిగా లేరు. మయాంక్ చేయి అంత దూరమెలా వచ్చి ఉంటుందని ప్రశ్నలు వేస్తున్నారు. అలా జరగడం అసాధ్యమని, మయాంక్ మన విశ్వంలో ఉండే వ్యక్తి కాదని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.