సినిమా తోపు.. క్లైమాక్స్ వీకు.. కొన్ని సినిమాలంతే. స్టార్టింగ్ నుంచి ప్రీ-క్లయిమాక్స్ వరకు సినిమా బాగుంటుంది. ఒక్కసారిగా క్లైమాక్స్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. అంతే.. సినిమా దుకాణం సర్దేస్తుంది. అలా క్లైమాక్స్ వల్ల దెబ్బతిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి.
శీను.. వెంకటేష్ చేసిన ఎన్నో రీమేక్స్ లో ఇది కూడా ఒకటి. రీమేక్ చేస్తే దాన్ని కెలక్కూడదు అనే రూల్ పెట్టుకున్న వెంకీ.. శీను సినిమాను కూడా అలానే చేశాడు. అదే ఈ సినిమా పాలిట శాపమైంది. వెంకీ లుక్స్, హీరోయిన్ అందాలు, మణిశర్మ పాటలు, కామెడీ అన్నీ బాగున్నప్పటికీ.. క్లైమాక్స్ ఈ సినిమాను బలి తీసుకుంది. హీరోయిన్ కు మూగవాడిగా పరిచయమైన వెంకీ.. ఆమెను మోసం చేయలేక క్లైమాక్స్ లో నిజంగానే మూగవాడిగా మారిపోవడం అనే కోణాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని ఇప్పటికీ వెంకీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటారు.
చక్రం.. చక్రం సినిమాలో కూడా క్లైమాక్స్ వీక్. సినిమాలో మంచి పాటలున్నాయి. మంచి కామెడీ, ఫైట్స్ కూడా ఉన్నాయి. జగమంత కుటుంబం అనే పాట అయితే ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్స్ లో ఒకటి. ఇంత సెటప్ ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ లో హీరో చనిపోవడం అనే ఎలిమెంట్ ను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బ్లడ్ కాన్సర్ తో హీరో చనిపోవడం, ఆ అస్తికల్ని కలపడానికి తండ్రి ప్రకాష్ రాజ్ రైళ్లో ప్రయాణించడం లాంటి సీన్స్ ను ఆడియన్స్ తట్టుకోలేకపోయారు.
వేదం సినిమా క్లయిమాక్స్ కూడా ఈ కోవలోకే వస్తుంది. క్లైమాక్స్ లో హీరో చనిపోతే అస్సలు తట్టుకోలేరు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది ఓ మల్టీస్టారర్ సినిమాలో ఏకంగా ఇద్దరు హీరోలూ చనిపోతే ఎలా ఉంటుంది? అచ్చం వేదం సినిమాలా ఉంటుంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బన్నీకి ఫిలింఫేర్ అవార్డు కూడా తెచ్చిపెట్టిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీనికి కారణం క్లైమాక్స్. హీరోలిద్దరూ చివర్లో చనిపోతారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పోషించిన కేబుల్ రాజు పాత్రను చంపేయడంతో పాటు.. అతడి మృతదేహాన్ని పడుకోబెట్టే క్లైమాక్స్ సీన్ ను మెగాభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బయటకొచ్చి సినిమా బాగుందని చెప్పలేకపోయారు.
భీమిలి కబడ్డీ జట్టుది కూడా ట్రాజడీ ఎండింగే. సినిమా అంతా సరదాగా సాగి, క్లైమాక్స్ లో సడెన్ గా హీరో చనిపోతే ఎలా ఉంటుంది? ప్రియురాలికి కనిపించకుండా, తల్లిని ఒంటరిని చేసి హీరో చనిపోయే సీన్ భీమిలి కబడ్డీ జట్టులో ఉంది. సెన్సిబుల్ మూవీ అనిపించుకున్న ఈ సినిమా, క్లయిమాక్స్ తో మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. రీమేక్ ను చెడగొట్టకూడదనే గుడ్డి నియమంతో తీసిన భీమిలి కబడ్డీ జట్టు.. కేవలం క్లయిమాక్స్ వల్ల ఫ్లాప్ అయింది.
అరవింద్ స్వామి, ప్రభుదేవా హీరోలుగా నటించిన మల్టీస్టారర్ రొమాంటిక్ సినిమా మెరుపు కలలు. కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు సంగీత ప్రియుల ఆల్ టైమ్ హిట్స్ జాబితాలో ఉంటాయి. అంత బాగుంటాయి సాంగ్స్. కానీ సినిమా డిజాస్టర్. దీనికి కారణం క్లైమాక్స్. అప్పటివరకు అమ్మాయి ప్రేమ కోసం పాకులాడిన అరవింద్ స్వామి ఆఖరి నిమిషంలో చర్చి ఫాదర్ గా మారిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు. నన్ అవుదామనుకున్న కాజోల్, తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. కానీ అప్పటివరకు ఎలాంటి హింట్ ఇవ్వకుండా వచ్చిన అరవింద్ స్వామి అకస్మాత్తుగా తెల్ల దుస్తుల్లో కనిపించేసరికి ఆడియన్స్ షాక్ తిన్నారు.
నక్షత్రం సినిమాది మరో వ్యథ. ఈ సినిమా కూడా చెత్త క్లయిమాక్స్ కు ఉదాహరణగా నిలిచింది. సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ ఈ సినిమాలో హీరోలుగానే కనిపిస్తారు. కృష్ణవంశీ తీసిన ఈ సినిమా మరో ఖడ్గం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో సాయిధరమ్ తేజ్ పాత్రను చంపేయడం, ఆ తర్వాత హీరోయిన్ ను కూడా చంపేయడం ప్రేక్షకులకు రుచించలేదు.
సిద్దార్థ్ నటించిన ఓయ్ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా మొత్తం భలే క్యూట్ గా ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. వాళ్లు చేసే అల్లరి కూడా బాగుంటుంది. కానీ క్లయిమాక్స్ కు వచ్చేసరికి హీరోతో ఇచ్చిన ముగింపు చాలామందికి నచ్చలేదు. కేవలం ఈ క్లయిమాక్స్ వల్ల ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ వృధా అయ్యాయి.
పవన్ కల్యాణ్ కెరీర్ లో కూడా ఇలాంటి ఓసినిమా ఉంది. దాని పేరు గుడుంబా శంకర్. ఏమాటకామాట చెప్పుకోవాలి, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కనిపించినంత ఎనర్జిటిక్ గా, జాలీగా మరే సినిమాలో కనిపించలేదు. పవన్ కెరీర్ లోనే మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ హిలేరియస్ మూవీగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో గాడి తప్పడానికి వీలులేని ఈ సినిమా కేవలం క్లయిమాక్స్ వల్ల పోయిందంటారు పవన్ అభిమానులు. అదేంటో ఇందులో కూడా పాటలన్నీ సూపర్ హిట్.
చెత్త క్లయిమాక్స్ తో ఫ్లాప్ అయిన సినిమాల లిస్ట్ లో ప్రేమికుల రోజు కూడా ఉంది. ఈ సినిమాలో లవ్ సీన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. రెహ్మాన్ కంపోజిషన్ లో వచ్చిన పాటలవి. హీరోహీరోయిన్లు మాట్లాడుకోకుండా ప్రేమించుకునే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సినిమా అంతా బాగుంటుంది కానీ క్లయిమాక్స్ కు వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. అదే సినిమా పోవడానికి మెయిన్ కారణం. దీనికితోడు తెలుగులో ఓ క్లయిమాక్స్, తమిళ్ లో మరో క్లయిమాక్స్ పెట్టి కిచిడీ చేసేశారు.
రీసెంట్ గా కూడా అలాంటిది ఓ సినిమా వచ్చింది. దాని పేరు హంట్. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా క్లయిమాక్స్ ను తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. హీరోను సినిమా చివర్లో హోమో సెక్సువల్ గా చూపించారిందులో. దీంతో సినిమా జాతకమే మారిపోయింది. అప్పటివరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా నటించిన సినిమా దుకాణం సర్దేసింది.