అన్ని సేవలకు తప్పనిసరి చేసిన ఆధార్ కార్డుపై ప్రముఖ రేటింగ్ సంస్థ ‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. బయోమెట్రిక్ సరిగా రాక చాలా మందికి సేవలు అందడం లేదని వెల్లడించింది. అత్యంత వేడి, తేమ వాతావరణంలో పనిచేసే కార్మికులు ఆధార్‌ను వినియోగించడం అంత విశ్వసనీయమైనది కాదని పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే చెల్లింపులకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని ప్రస్తావిస్తూ మూడీస్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే మూడీస్ ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది. ఆధార్ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్ ముందు నివేదించామని స్పష్టం చేసింది. ఇక బయోమెట్రిక్ కోసం కేవలం వేలిముద్ర మాత్రమే కాకుండా, ఫేస్, ఐరిస్ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్‌లెస్ మార్గాలు కూడా ఉన్నాయని వివరించింది.