తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసింది. అనంతరం పొగపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబంతో కలిసి అంగడిబజార్ ప్రాంతంలో నివాసముంటున్నారు. పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి వారు మేకలు పెంచుతున్నారు. తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అయితే సుమారు 20 రోజుల క్రితం మంద నుంచి ఒక మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయాయి. తేజతోపాటు అతని స్నేహితుడైన చిలుముల కిరణ్(30)పై అనుమానం వచ్చిన యజమాని కుటుంబసభ్యులు శుక్రవారం ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. వారిపై దాడి చేసి, తలకిందులుగా వేలాడదీసి, పొగ పెట్టి ఊపిరాడకుండా చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో కిరణ్ చిన్నమ్మ అయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 342, 367 సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసును నమోదు చేసి రాములు కుటుంబ సభ్యుల్ని నలుగురును అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. మరోవైపు కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.